ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మాజీ ఎమ్మెల్సీ పురాణంకు తప్పిన ప్రమాదం

మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా స్థానిక సంస్థల మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​​ కుమార్​కు త్రుటితో పెను ప్రమాదం తప్పింది. యాక్సిడెంట్​లో కారు నుజ్జునుజ్జు అయినప్పటికీ ఆయన సురక్షితంగా బయటపడ్డారు. సతీష్ తన కొడుకు కౌశిక్​, కుటుంబసభ్యులతో కలిసి​ శుక్రవారం స్వగ్రామమైన కోటపల్లి నుంచి ఇన్నోవా కారులో హైదరాబాద్​కు బయల్దేరారు. సిద్దిపేట జిల్లా కుకునూర్​పల్లి వద్ద వస్తున్న వాహనం ఆయన కారును ఢీకొంది. ఈ ఘటనలో ఇన్నోవా ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్నవాళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు.

బీఆర్ఎస్ ను దేశమంతా స్వాగతిస్తోంది​

మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్,వెలుగు: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన బీఆర్ఎస్​పార్టీని దేశమంతా స్వాగతిస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. నర్సాపూర్ (జి) మండలానికి చెందిన దాదాపు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అంతకమంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఏర్సాటును స్వాగతిస్తూ సీఎం కేసీఆర్​ఫొటోకు టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. దేశంలో కాంగ్రెస్​పార్టీకి కాలం చెల్లిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దేశానికి కేసీఆర్​ప్రధాన మంత్రి కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్ సీ ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పార్టీ లీడర్లు రామ్ కిషన్ రెడ్డి, ముడుసు సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

టాయిలెట్ల బిల్లులు ఇప్పించాలె

ఆసిఫాబాద్,వెలుగు: టాయిలెట్ల బిల్లులు స్వాహా చేసిన చింతలమానేపల్లి మండలం ఏటిగూడ సర్పంచ్, సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ఎదుట నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 92 మరుగుదొడ్లు మంజూరైతే 42 మంది బిల్లులు సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. కలెక్టర్​ఎంక్వైరీ చేసి సర్పంచ్, సెక్రటరీలను సస్పెండ్ చేయాలని లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని ఆయన స్పష్టంచేశారు. కార్యక్రమంలో చింతలమానేపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సప్త శ్రీనివాస్, ఐటీ  సెల్ జిల్లా కో కన్వీనర్ అల్లి వసంత్, లబ్ధిదారులు 
తదితరులు పాల్గొన్నారు.

 మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్​వికటించి మృతిచెందిన ఆదివాసీ మహిళ పంచపూల కుటుంబానికి న్యాయం చేయాలని ఏఐసీసీ మెంబర్ గండ్రత్ సుజాత డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆదిలాబాద్ మండలం గుండంలొద్ది గ్రామానికి చెందిన మడావి పంచపులా గతనెల 28న డెలివరీ కోసం రిమ్స్ లో చేరిందని పేర్కొన్నారు. వైద్యులు ఆమెకు డెలివరీతో పాటు కుటుంబ నియంత్రణ సర్జరీ చేశారని చెప్పారు. కాగా సెప్టెంబర్ 30న ఆ మహిళ మృతి చెందిందని తెలిపారు. వైద్యులు గుట్టు చప్పుడు కాకుండా అదేరోజు డిశ్చార్జి చేసి పంపించేశారన్నారు. గ్రామస్తులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తల్లి దూరమైన చిన్నారికి న్యాయం చేయాలన్నారు. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్​చేశారు. తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆమె వెంట కొండ గంగాధర్, గ్రామస్తులు, బాధిత కుటుంబం ఉన్నారు.

పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి

ఆదిలాబాద్,వెలుగు: టీఎస్పీఎస్సీ పరీక్షా కేంద్రాల్లో  సీసీ కెమెరాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆమె పరిశీలించారు. గ్రూప్-–1 పరీక్షకు వినియోగించే కేంద్రాల్లో అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని, ప్రతీకేంద్రంలోని పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.  ఆయా కేంద్రంలోని గదుల సామర్థ్యాన్ని బట్టి అభ్యర్థులకు సీటింగ్​కెపాసిటీ ఏర్పాటు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్​ రాథోడ్, డీఈవో ప్రణీత, కలెక్టరేట్ ఏఓ వర్ణ ఉన్నారు.

ఏఐటీయూసీతోనే కార్మికుల హక్కుల పరిరక్షణ  

మందమర్రి,వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారించడంలో యాజమాన్యం విఫలమైందని, ఏఐటీయూసీ ఉద్యమాల ఫలితంగా హక్కుల పరిరక్షణ సాధ్యమని ఆ యూనియన్​బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం మందమర్రిలోని యూనియన్ ఆఫీస్​లో బెల్లంపల్లిలో జరిగే ఏఐటీయూసీ మహాసభల పోస్టర్లను రిలీజ్​చేశారు. మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో యూనియన్​ బ్రాంచి సెక్రటరీ కంది శ్రీనివాస్​, పిట్ సెక్రటరీలు వెల్ది ప్రభాకర్, కుమార్, మనోహర్, శర్మ, లీడర్లు టేకుమట్ల తిరుపతి, దినేశ్, గుమ్మడి సంపత్, బంగారం, బండి మల్లేశ్, అల్తాఫ్ తదితరులు 
పాల్గొన్నారు. 

ఎంపీని పరామర్శించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్​

బోథ్,వెలుగు: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్న సోయం మాణిక్ రావు శుక్రవారం గుండె పోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్​రాథోడ్​జనార్దన్​నాగూగూడ వెళ్లి ఎంపీని పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, ఎంపీపీ తులా శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కె.ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గండు రాజు 

మంచిర్యాల,వెలుగు: బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గండు రాజు ముదిరాజ్ నియమితులయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఆదేశాల మేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ గుండు రాజుకు శుక్రవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీజేపీలో చేరగా వారికి వెంకటకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా ఉపాధక్షుడు బోయిని దేవేందర్, దుగ్నే సాయి పాల్గొన్నారు. 

గిరిజన బంధులో ప్రాధాన్యం ఇవ్వాలె

బెల్లంపల్లి, వెలుగు: గిరిజన బంధులో ఎరుకల కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి డిమాండ్​చేశారు. శుక్రవారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు10 శాతం రిజర్వేషన్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎరుకల ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. బెల్లంపల్లిలో కమ్యూనిటీ హాల్​నిర్మించాలన్నారు. మహిళా గ్రూపులకు వడ్డీ లేని రూ.10 లక్షల రుణం అందజేయాలన్నారు. హక్కుల సాధన కోసం కార్యకర్తలు, లీడర్లు అంకితభావంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి మహేశ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాలక్క, నియోజకవర్గ అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షులు అశోక్, అంజి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.