కడెం ప్రాజెక్ట్ ను ఆ ఎల్లమ్మ తల్లే కాపాడాలి: ఇంద్రకరణ్ రెడ్డి

కడెం ప్రాజెక్ట్ ను ఆ ఎల్లమ్మ తల్లే కాపాడాలి: ఇంద్రకరణ్ రెడ్డి

కడెం ప్రాజెక్టును దేవుడే కాపాడాలన్నారు  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రాజెక్ట్ పై నుంచి వరదనీరు ప్రవహించటంతో ఆ ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లోకి చేరుకొంది. సమాచారం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్ట్ దగ్గరకు చేరుకొని ఇరిగేషన్ అధికారులతో వరద పరిస్థితిని సమీక్షించారు. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండటం, గేట్లు పైకి లేవకపోవటంపై మంత్రి స్పందించారు. ఇక ప్రాజెక్ట్ ను ఎల్లమ్మ తల్లే కాపాడాలన్నారు. ప్రాజెక్ట్ పరివాహక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. తెరుచుకోని గేట్ల మరమ్మత్తుల కోసం ఎక్స్ పర్ట్స్ ను రప్పిస్తామన్నారు.

ఎగువన కురుస్తోన్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పెరిగింది. గేట్ల పై నుంచి వరద పారుతోంది. ఎగువన నుంచి 3 లక్షల  87 వేల క్యూసెక్కుల కు పైగా వరద ప్రాజెక్ట్ లోకి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు  14 గేట్లు ఎత్తి ..... దిగువకు 2 లక్షల 47 వేల  క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే మరో 4 గేట్లు మొరాయించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మంచిర్యాల-నిర్మల్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతితో  ప్రాజెక్ట్ దగ్గరకు పర్యాటకులను అనుమతించడంలేదు.  ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో లోతట్టు ప్రాంతాల్లోని పబ్లిక్ లో టెన్షన్ నెలకొంది. 

కడెం ప్రాజెక్టును సందర్శించారు కలెక్టర్ వరుణ్ రెడ్డి. వరద పరిస్థితులను సమీక్షించారు. 10 గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఎక్కువైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే కడెం ప్రాజెక్టు గేట్లు మొరాయించాయన్నారు గ్రామస్తులు.