అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: జగదీశ్​రెడ్డి  

అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: జగదీశ్​రెడ్డి  

సూర్యాపేట, వెలుగు : కుంభకోణాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి జగదీశ్​రెడ్డి ఆరోపించారు.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం.. ఇప్పుడు కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం సూర్యాపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ కు ఉన్న ఏకైక అర్హత వారసత్వమేనని అన్నారు.

పగటి దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్​ను రాహుల్‌ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారు. మోడీ దయాదాక్షిణ్యాల మీద గాంధీ కుటుంబం బతుకుతోందన్నారు. బోఫోర్స్ కేసులో పీకల లోతు కూరుకుపోయిన చరిత్ర గాంధీ కుటుంబానిదని, గుజరాత్ ఎన్నికల్లో అటువైపు చూడకపోవడమే కాంగ్రెస్, బీజేపీల లాలూచీ రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలకు జ్ఞానం, విజ్ఞానం, విచక్షణ లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ బతుకు నాశనం అయిందనే అవాకులు చవాకులు పలుకుతున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాశ్​పాల్గొన్నారు.