టీఆర్‌ఎస్‌లో ఎవరిపైనా భూకబ్జా ఫిర్యాదుల్లేవ్

టీఆర్‌ఎస్‌లో ఎవరిపైనా భూకబ్జా ఫిర్యాదుల్లేవ్

హైదరాబాద్‌, వెలుగు: భూములు కబ్జా చేశారన్న ఫిర్యాదులు టీఆర్‌ఎస్‌లో ఎవరిపైనా  లేవని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. బీజేపీలో చేరిన ఈటలకు టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. హుజూరాబాద్‌ ప్రజలకు ఈటల ద్రోహం చేశారని, బీజేపీలో చేరడంపై సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. సోమవారం టీఆర్‌ఎస్‌ ఎల్పీలో జగదీశ్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ మునిగిపోతున్న నావ అని, ఆ పార్టీతో పాటే ఈటల, ఆయన వెంట వెళ్లిన వాళ్లు మునిగిపోవడం ఖాయమని విమర్శించారు. ముందస్తు ఎజెండాతోనే బీజేపీలో ఈటల రాజేందర్​ చేరారని ఆరోపించారు. ‘‘పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. టీఆర్​ఎస్​ను ఈటల విడిచి వెళ్లేంత ఉక్కపోత వాతావరణం లేదు.  తేడాలుంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉన్నా వాటిని ఉపయోగించుకోలేదంటే ముందే ఈటల ప్రిపేర్‌ అయినట్టు అనిపిస్తోంది” అని దుయ్యబట్టారు. గుంపును వదిలి అడవిలకు పోతే సింహాలు, నక్కల పాలవుతారని హెచ్చరించారు. ఈటల భూములపై విచారణ పూర్తయ్యే వరకు ఆయన టీఆర్‌ఎస్‌లోనే ఉండాల్సిందన్నారు. కొందరు శత్రువులు ఈటలకు పట్టిన గతే తనకు పడుతుందని కలలుగంటున్నారని, అది కలలో కూడా జరగదని వ్యాఖ్యానించారు..

హంపిలో జరిగిందొకటి.. ప్రచారం ఇంకోలా..

కర్నాటకలోని హంపిలో జరిగింది ఒకటైతే బయట జరుగుతున్న ప్రచారం ఇంకోలా ఉందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. తాను హంపికి వెళ్లడం మొదటి సారి కాదని, రెండోసారి వెళ్లినప్పటి ఘటనను రాజకీయం చేస్తున్నారని అన్నారు. మళ్లీ ఒకసారి అక్కడికి వెళ్లడానికి రెడీ అవుతున్నామని ఆయన చెప్పారు.