ఖతార్​లో మనోళ్ల రిలీజ్​కు ప్రయత్నిస్తున్నం: మంత్రి జైశంకర్

ఖతార్​లో మనోళ్ల  రిలీజ్​కు ప్రయత్నిస్తున్నం: మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ, పణజి: ఖతార్‌‌ లో మరణశిక్ష పడిన మనోళ్లను విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పారు. భారత నేవీలో పనిచేసి, రిటైరయ్యాక ఎనిమిది మంది ఖతార్​ సంస్థలో చేరారు. అయితే, గూఢచర్యం ఆరోపణలతో వారిని ఖతార్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో సోమవారం బాధిత కుటుంబాలను జై శంకర్​ పరామర్శించారు. వారికి భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. కేసులో అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. 

మీ ఆందోళనను, బాధలను పూర్తిగా పంచుకుంగామని వారిని ఓదార్చారు.‘‘ఖతార్‌‌లో నిర్బంధించిన ఎనిమిది మంది ఇండియన్​ మాజీ నేవి సిబ్బంది కుటుంబాలతో ఈ ఉదయం సమావేశమయ్యాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. బాధిత కుటుంబాల ఆందోళనలు, బాధలను దేశమంతా పంచుకోవాలి” అని జైశంకర్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నం: అడ్మిరల్ కుమార్

ఖతార్‌‌లో కోర్టులో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మాజీ నేవి సిబ్బందికి రిలీఫ్​​కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ తెలిపారు. సోమవారం పణజిలో ఇండియన్ నేవి నిర్వహించిన గోవా మారిటైమ్ కాన్​క్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖతార్​ కోర్టు తీర్పును దిగ్భ్రాంతికరమైన చర్యగా పేర్కొన్నారు. వారి రిలీఫ్ కోసం కేంద్ర ప్రభుత్వం ​తీవ్రంగా కృషి చేస్తున్నదని చెప్పారు.