
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో శుక్రవారం నుంచి 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఈ నెల19వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగనుందని స్పష్టం చేశారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారని గౌరీశంకర్ వెల్లడించారు.
బుక్ ఫెయిర్‌కు వచ్చే పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా 10 తేదీ నుంచి 18వ తేదీ వరకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. బుక్ ఫెయిర్ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు, వేదికకు సాహిత్య రంగానికి సేవలందించిన రవ్వా శ్రీహరి పేరును, ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ పేరు పెడుతున్నట్లు చెప్పారు. పుస్తక ప్రదర్శన ఆవరణలో తెలంగాణ అమర వీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు గౌరీశంకర్ పేర్కొన్నారు.
365 స్టాల్స్..లక్షల పుస్తకాలు
బుక్ ఫెయిర్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ పబ్లిషర్స్‌తో 365 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పిల్లల్లో పుస్తక పఠనాభిలాషను పెంపొందించడానికి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిల్లలకు, టీచర్లకు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతిరోజూ రెండు నుంచి 4 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 4 నుంచి 8 గంటల వరకు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.