తేమ పేరుతో.. మిల్లర్ల కొర్రీలు

తేమ పేరుతో.. మిల్లర్ల కొర్రీలు

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్​పల్లిలోని కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వడ్లు అమ్మగా, సెంటర్​లో 14 శాతం తేమ వచ్చింది. ఆ వడ్లను ఖిల్లాగణపురం మండలం సోలిపూర్​లోని మిల్లుకు తరలించారు. అక్కడ మిల్లరు తేమను పరిశీలించి 22 శాతం చూపిస్తోందని, ఆ మేరకు కోత విధిస్తానంటూ మొండికేశాడు. ఇదేమిటంటూ రైతు వాపోయినా మిల్లరు ఒప్పుకోలేదు. ఇలాంటి ఇబ్బందులు ఒక్క పెద్దమందడి మండల రైతులే కాదు. జిల్లాలోని చాలా చోట్ల ఎదురవుతున్నాయి. మూడు రోజుల కింద జరిగిన మీటింగ్​లో మంత్రి జూపల్లి ఆదేశాలను పాటిస్తామని చెప్పిన మిల్లర్లు, మరుసటి రోజు నుంచే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారు.

వనపర్తి, వెలుగు:  కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వచ్చిన ధాన్యంలో ఎలాంటి కోతలు పెట్టవద్దని, మిల్లర్లు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి తేమ శాతాన్ని చూసుకోవాలని గురువారం వనపర్తిలో జరిగిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మిల్లర్లను ఆదేశించారు. దీనికి అంగీకరించిన మిల్లర్లు ఆ తరువాత రోజు నుంచే తేమ పేరుతో ఇబ్బంది పెట్టడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల సంఘం ప్రతినిధి ఒకరు తన మిల్లులోనే తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతుండగా, మిగిలిన మిల్లర్లు సైతం తేమ పేరుతో దోపిడీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కాంటా అయిన తరువాత మిల్లుల్లో 8 శాతం కోత విధిస్తుండంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అందరికీ ఒకే విధంగా కోత..

ఒక్కో లారీలో 10 నుంచి 15 మంది రైతుల వడ్లను మిల్లుకు తరలిస్తున్నారు. ఒక్కో రైతు వడ్లు ఒక్కో రకంగా తేమ చూపిస్తాయి. కానీ, మిల్లరు మాత్రం లారీలో తేమ శాంపిల్​ తీసుకుని లోడు మొత్తానికి అదనపు కోత విధిస్తానని చెబుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ కొలిచే మెషీన్లలో వ్యత్యాసాలు ఉంటే, ఒకే రకమైన మెషీన్లు కొని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, మిల్లర్లకు అందజేయాలని మంత్రి సూచించినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.

రూ.400 కోట్ల సీఎంఆర్​ పెండింగ్..​

వనపర్తి జిల్లాలో 2020–-21 నుంచి మిల్లర్లు రూ.400 కోట్ల సీఎంఆర్​ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి జిల్లాలోనే ఎక్కువగా పెండింగ్​ ఉంది. ఈ సీజన్​లో జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్  టన్నుల దిగుబడి రానుండగా, అందులో 3.50 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని సివిల్​ సప్లై​ఆఫీసర్లు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా జిల్లాలో 396 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇప్పటి వరకు 330 సెంటర్లు  ఓపెన్​ చేశారు.

మిల్లర్లు సతాయిస్తే కంప్లైంట్​ చేయండి..

కొనుగోలు కేంద్రంలో కాంటా అయ్యాక లోడు దించుకునేందుకు మిల్లర్లు సతాయించవద్దు. మిల్లరు సతాయిస్తుంటే నేరుగా నాకు ఫిర్యాదు చేస్తే కోత విధించకుండా చూస్తాం. రైతులకు ఇబ్బంది కలిగించే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు 33 వేల మెట్రిక్  టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, 18 వేల మెట్రిక్  టన్నులకు సంబంధించి వివరాలు ట్యాబ్ లో ఎంట్రీ చేశాం.  జగన్మోహన్, డీఎం, సివిల్​ సప్లై