
- ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, వెలుగు: యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. మహబూబ్నగర్కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తుడి మేఘారెడ్డి, రాజేశ్‌రెడ్డితో కలిసి ఆఫీసర్లతో యూరియాపై రివ్యూ నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ.. యూరియాను కొందరు దాటిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, కొందరు ఎక్కువ రేటుకు రైతులకు అమ్ముతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న స్టాక్ సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యూరియా దుకాణాలు, పీఏసీఎస్, ఆగ్రో సేవా కేంద్రాల వద్ద ఒక్కో ఆఫీసర్‌ను నియమించాలన్నారు. యూరియా ఇండెంట్ ఎంత వచ్చింది? స్టాక్ లభ్యత ఎంత ఉంది? ఇప్పటి వరకు ఎంత సరఫరా చేశారు? తదితర విషయాలపై పక్కాగా మానిటర్ చేయాలన్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన యూరియా కోటా రాలేదని, దాదాపు 3 లక్షల మెట్రిక్‌టన్నులకు పైగానే యూరియా రావాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో, కేంద్ర మంత్రులతో మాట్లాడారని.. త్వరలో రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. సమీక్షలో కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, ఆదర్శ సుకభి, బదావత్సంతోష్, బీఎం సంతోష్, ఎస్పీలు డి.జానకి, పి.యోగేశ్‌గౌతమ్, గైక్వాడ్వైభవ్, రావుల గిరిధర్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.