విశ్వశాంతికి బౌద్ధమే మార్గం : మంత్రి జూప‌‌‌‌ల్లి కృష్ణారావు

విశ్వశాంతికి బౌద్ధమే మార్గం : మంత్రి జూప‌‌‌‌ల్లి  కృష్ణారావు
  •     అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సులో మంత్రి జూపల్లి
  •     హాజరైన 22 దేశాల ప్రతినిధులు
  •     మంత్రికి అంతర్జాతీయ శాంతి పురస్కారం అందజేత

హైదరాబాద్, వెలుగు: విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి గౌతమ బుద్ధుడి కరుణ, బోధ‌‌‌‌న‌‌‌‌లు, ఆయన పాటించిన అహింస మార్గాలే మానవాళిని కాపాడగలవని, సమకాలీన సమస్యలకు మార్గదర్శకంగా నిలుస్తాయని మంత్రి జూప‌‌‌‌ల్లి  కృష్ణారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని హరిత ప్లాజాలో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సు - 2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బౌద్ధ వారసత్వ పరిరక్షణ, ప్రపంచ శాంతి స్థాపనకు అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడిలో మంత్రి చూపుతున్న చొరవను గుర్తిస్తూ ఇంటర్నేషనల్ ఇంటర్‌‌‌‌ఛేంజ్ డెవలప్‌‌‌‌మెంట్ అసోసియేషన్ జూపల్లికి ప్రతిష్టాత్మక ‘గ్రాండ్ ప్రైజ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్’ అవార్డును ప్రదానం చేసింది. 

అసోసియేషన్ అధ్యక్షుడు మున్ యోంగ్ జో ఈ పురస్కారాన్ని అందజేస్తూ.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఆస‌‌‌‌రాగా నిలుస్తూ మానవ విలువల కోసం కృషి చేస్తున్నారని జూపల్లి సేవలను కొనియాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న శాంతి, సహనం, అహింస విలువలకు లభించిన గుర్తింపు అన్నారు. తెలంగాణ గడ్డ వేల ఏండ్లుగా బౌద్ధ వైభవానికి నిలయమని గుర్తుచేశారు. 

కృష్ణా నదీతీరాన ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని, శూన్యతా సిద్ధాంతాన్ని ప్రవచించి ఈ ప్రాంతాన్ని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట వంటి చారిత్రక ప్రదేశాలు కేవలం పురావస్తు కేంద్రాలు మాత్రమే కావని,  మన మహోజ్వల నాగరికతకు సజీవ సాక్ష్యాలని అభివర్ణించారు. ఈ క్షేత్రాల సంరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక చిత్రపటంలో అగ్రగామిగా నిలబెడతామని పేర్కొన్నారు. 

సమగ్ర బౌద్ధ పర్యాటక వలయాన్ని రూపుదిద్దుతూ యాత్రికులకు ప్రపంచ స్థాయి అనుభవం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీలంక బౌద్ధ శాసన మంత్రి ప్రొఫెసర్ హినిదుమ సునీల్ సేనెవి, వియత్నాం ప్రతినిధి డాక్టర్ తిచ్ నాత్ తు,  బుద్ధవ‌‌‌‌నం ప్రాజెక్ట్ స్పెష‌‌‌‌ల్ ఆఫీస‌‌‌‌ర్ మ‌‌‌‌ల్లేప‌‌‌‌ల్లి ల‌‌‌‌క్ష్మయ్య, పురావ‌‌‌‌స్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, స‌‌‌‌ద‌‌‌‌స్సు కోఆర్డినేట‌‌‌‌ర్ శివ‌‌‌‌నాగి రెడ్డితోపాటు 22 దేశాల నుంచి వచ్చిన 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.