హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగర భవిష్యత్తును, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ తీసుకొచ్చిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇది ఆదరాబాదరాగా తీసుకున్న నిర్ణయం కాదనీ, 11 సార్లు భేటీ అయి చర్చించిన తర్వాతే రూపొందించామని తెలిపారు.
గత ప్రభుత్వం మాత్రం ఐడీపీఎల్ భూముల్లో భారీ అక్రమాలకు పాల్ప డిందనీ, వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేసిందని వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై మంత్రి జూపల్లి మాట్లాడారు. నగర అభివృద్ధిని కాంక్షిస్తూ, కాలుష్య రహిత వాతావరణాన్ని పెంపొందించేందుకే ఈ పాలసీ తెచ్చామన్నారు. 50-, 60 ఏళ్ల క్రితం ఉన్న హైదరాబాద్ వేరు.. ఇప్పటి హైదరాబాద్ వేరు అని పేర్కొన్నారు.
