కాళోజీ రచనలను ఆదర్శంగా తీసుకోవాలి..ప్రజాకవిగా అలుపెరగని పోరాటం చేశారు: మంత్రి జూపల్లి

కాళోజీ రచనలను ఆదర్శంగా తీసుకోవాలి..ప్రజాకవిగా అలుపెరగని పోరాటం చేశారు: మంత్రి జూపల్లి
  • కవయిత్రి నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి కాళోజీని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి వేడుకలను, తెలంగాణ భాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. 

ప్రజాకవిగా అలుపెరగని పోరాటం చేసిన గొప్పకవి కాళోజీకి నివాళుర్పించారు. తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. కాళోజీ తన జీవిత కాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్నీ ఊపిరిగా మార్చుకుని, వాటిలో తనవంతు పాత్ర చురుగ్గా పోషించారన్నారు. సమకాలీన సమాజంపై ఆయన ప్రభావం అపారమైనదని, మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు లాంటి వారు కాళోజీ అంటే అమితమైన గౌరవాభిమానాలు చూపేవారని చెప్పారు. 

స‌‌మాజ గొడ‌‌వ‌‌ను త‌‌న గొడ‌‌వ‌‌గా మార్చుకుని ‘నా గొడ‌‌వ పేరు’తో రాసిన క‌‌విత‌‌లు స‌‌మాజానికి మార్గదర్శకాలుగా మారాయని పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప ప్రజాకవి అని, ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించి, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన మహానుభావుడని  ఆయన సేవలను కొనియాడారు.

 ప్రజాకవి కాళోజీ జీవిత చరిత్ర గ్రంథాలను అందరికీ తెలియజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో, గ్రామాల్లో ఉండేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస రావు, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, తదితరులు పాల్గొన్నారు.

చర్లపల్లి డ్రగ్స్ కేసులో నివేదిక ఆధారంగా చర్యలు

చర్లపల్లి డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించినట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నివేదిక రాగానే దాని ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు. మంగళవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను వినతి పత్రాల రూపంలో స్వీకరించారు.

 అనంతరం వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ... గ్రూప్–1 విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పరిశీలిస్తుందని, తిరిగి పరీక్ష  నిర్వహించడమా...రీ వాల్యూయేషన్ చేయడమా..అనే దానిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 

పదేండ్ల పాటు  అధికారంలో ఉన్న బీఆర్ఎస్..ఒక్కసారి కూడా గ్రూప్–1 నిర్వహించలేదని, అలాంటి వారు కూడా ఇప్పుడు కోర్టు తీర్పుపై మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మేడిగడ్డ కూలిపోయినందుననే సీబీఐ విచారణ కోరామని, వాటర్ పంపింగ్ కు కీలకమైన మేడిగడ్డనే కూలిపోయినప్పుడు ఇక ఆ ప్రాజెక్టు నుంచి నీరు ఎలా వస్తుందని వివరించారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీటిని వాడుతున్నామని వెల్లడించారు.