కాకా అంబేద్కర్ బాటలో నడిస్తే.. వివేక్, వినోద్లు కాకా బాటలో ప్రజాసేవ చేస్తున్నారు: మంత్రి జూపల్లి

కాకా అంబేద్కర్ బాటలో నడిస్తే.. వివేక్, వినోద్లు కాకా బాటలో ప్రజాసేవ చేస్తున్నారు: మంత్రి జూపల్లి

కాకా వెంకటస్వామి అంబేద్కర్ బాటలో నడిచి పేద ప్రజలకు సేవ చేస్తే.. ఆయన వారసులు మంత్రి వివేక్, వినోద్లు కాకా బాటలో ప్రజాసేవ చేస్తున్నారని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మూడు తరాలు ప్రజాసేవలో ఉండటం గొప్ప విషయం అని.. ఆయన మనుమడు ఎంపీ వంశీకృష్ణ కూడా ప్రజాసేవ చేయడం అభినందనీయం అని అన్నారు. ఆదివారం (అక్టోబర్ 05) రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కాకా వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి.. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. 

40 ఏండ్ల క్రితం కాకాను కలిశానని ఈ సందర్భంగా కాకాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి జూపల్లి. పేదవాళ్ల పైన తపన, మక్కువతో ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. మనం బతకడం కాదు.. పది మందిని బతికించాలని నమ్మిన వ్యక్తి కాకా అని అన్నారు. తెలంగాణ సాధించడంలో కాకా కుటుంబం పాత్ర ఉందని.. కాకా పాత్రతో పాటు వివేక్, వినోద్ పాత్ర కూడా ఉందని అన్నారు. కాకా కుటుంబానికి సమాజం రుణపడి ఉందని ఈ సందర్భంగా అన్నారు. 

అత్యంత పేద కుటుంబంలో పుట్టి, డిగ్రీ పూర్తి చేసి.. అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకు వెళ్లిన వ్యక్తి కాకా అని కొనియాడారు మంత్రి జూపల్లి. దళితులతో పాటు బహుజనుల ఆత్మగౌరవం, అభివృద్ధి  కోసం పోరాడారని అన్నారు. సాదా సీదా జీవితం.. సింపిల్ లివింగ్.. హై థింకింగ్ ఉన్న వ్యక్తి కాకా అని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీలో1950  నుంచి ఉంటూ ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కాకా.. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోకూడా మంత్రిగా పనిచేశారని అన్నారు. ఇప్పుడు డబుల్ రూం అని మనం అంటున్నాం.. కానీ అప్పట్లోనే నిలువ నీడ లేని పేదలకు గుడిసెలు వేయించి గుడెసెల వెంకటస్వామిగా ఖ్యాతి సంపాదించారని మంత్రి కొనియాడారు.