ఎల్లమ్మగూడెం కిడ్నాప్ వ్యవహారం రాజకీయ డ్రామా : కాంగ్రెస్ బీసీ నేతలు

ఎల్లమ్మగూడెం కిడ్నాప్ వ్యవహారం రాజకీయ డ్రామా : కాంగ్రెస్ బీసీ నేతలు
  • మంత్రి కోమటి రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు: కాంగ్రెస్ బీసీ నేతలు 

నల్గొండ, వెలుగు: నల్గొండ నియోజకవర్గంలో వివిధ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, కనగల్ మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, బీసీ సంఘాల నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. 

20 సంవత్సరాలుగా నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తున్నాడన్నారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెంలో మామిడి యాదగిరి కిడ్నాప్ వ్యవహారం రాజకీయ డ్రామా అని ఆరోపించారు.  ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను  గెలిపించడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. 

మంత్రి ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఇక్కడ ప్రతి కార్యకర్త పని చేశారని తెలిపారు. బీసీల పక్షాన తీన్మార్ మల్లన్న పోరాడితే తామంతా తప్పకుండా మద్దతుగా ఉంటామని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ బీసీ సంఘాల నేతలు జూలకంటి శ్రీనివాస్, ప్రదీప్ నాయక్, జేరిపోతుల భాస్కర్, వజ్జ రమేశ్ యాదవ్, అల్లి  సుభాష్ యాదవ్, ఇటికాల శ్రీనివాస్, పిల్లి రమేశ్ యాదవ్, గోగుల గణేష్ యాదవ్  పాల్గొన్నారు.