
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో నేషనల్ హైవేల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. కేంద్ర సహకారంతో వచ్చే మూడేండ్లు రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ – హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామన్నారు. సోమవారం ఢిల్లీలోని గడ్కరీ నివాసంలో ఆయనతో వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), హైదరాబాద్ – విజయవాడ రహదారి విస్తరణపై చర్చించారు. అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ పై చర్చ జరుగుతుంది కానీ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు. దీనికి తోడు తాజా ఎన్నికల కోడ్ తో ప్రాజెక్ట్ పనుల్లో మరింత జాప్యం జరిగింది. ఈ పనుల్ని వేగవంతం చేసేలా అధికారుల్ని ఆదేశించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన” అని తెలిపారు. ‘‘హైదరాబాద్ –విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మర్చాలని కొన్నేండ్లుగా కేంద్రాన్ని కోరుతున్నం. ఈ రహదారిపై రోజుకు 60 వేల వాహనాలు తిరుగుతున్నాయి. జీఎమ్మార్ అనే సంస్థ టోల్ రోడ్డు పనులు తీసుకొని 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. వారు వివిధ కారణాలు చూపించి పనులు పూర్తిచేయలేదు.
దీనివల్ల ప్రతిరోజు అనేక ప్రమాదాలు జరిగి కొందరు వికలాంగులుగా మారితే, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో నేను ఎంపీ హోదాలో ఈ రహదారి పరిస్థితిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. గుర్తించిన 17 ప్రమాదకర బ్లాక్ స్పాట్ల మరమ్మత్తులకు నితిన్ గడ్కరీ రూ. 375 కోట్లు మంజూరు చేశారు. అయితే పనులు చేయాల్సిన జీఎమ్మార్ సంస్థ రెండుసార్లు కోర్టుకు పోయి పనులు ఆలస్యం చేసింది. చివరగా మూడోసారి టెండర్ పిలిచి తాజాగా పనులు ప్రారంభించింది” అని ఆయన చెప్పారు. హైదరాబాద్ – విజయవాడ హైవే లో బ్లాక్ స్పాట్స్ రిపేర్లు మాత్రమే కాకుండా, ఈ రహదారిని 6 లైన్ల రోడ్డుగా విస్తరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. త్వరలోనే ఆర్ఆర్ఆర్ పనుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని వెంకట్రెడ్డి తెలిపారు. దీనితో పాటు పెండింగ్ లో ఉన్న 16 రోడ్ల పురోగతి, న్యూ నేషనల్ హైవేల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు.
ఉప్పల్–ఘట్కేసర్ ఫ్లై ఓవర్ టెండర్లు రద్దు!
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఉప్పల్ –ఘట్ కేసర్ ఫ్లై ఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ఉన్నతాధికారులను కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. గడ్కరీతో భేటీ అనంతరం ఆయన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి.. అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తున్నం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ ను భారీగా పెంచుకుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ, తాజా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగిందని తెలిపారు. ప్రజలు తమ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసం ఏమాత్రం తగ్గకుండా సుస్థిర పాలన అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం ఢిల్లీ వచ్చినట్లు తెలిపారు. మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరవుతామని, అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేస్తామన్నారు. అలాగే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు అటవీ, పర్యావరణ అనుమతులపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.