ఇవాళ్టి (జనవరి 28) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రెండు దశల్లో 30 రోజులు నడవనున్న సభలు

ఇవాళ్టి (జనవరి 28)  నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రెండు దశల్లో 30 రోజులు నడవనున్న సభలు
  • రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో సెషన్ ప్రారంభం
  • వచ్చే నెల 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల
  • రెండు దశల్లో 30 రోజులు సమావేశం కానున్న ఉభయ సభలు
  • కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్
  • సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి
  • నరేగా, సర్, విదేశాంగ విధానాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం పార్లమెంట్‌‌ బడ్జెట్ సమావేశాలు బుధవారం (జనవరి 28)  నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో ఈ సమావేశాలు సాగనున్నాయి. సోమవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సెషన్ జరగనుంది. ఈ రెండు విడతలు కలిపి మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. 

 తొలిరోజు (బుధవారం) ఉభయ సభలను ఉద్దేశించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా.. పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రసంగం చదవనున్నారు. అయితే ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగే అవకాశం ఉంది. 

నరేగా, సర్, యూజీసీ నిబంధనలపై చర్చకు విపక్షాల పట్టు..

బడ్జెట్ సెషన్ లో నరేగా(ఎంజీఎన్ఆర్ఇజీఏ) పునరుద్ధరణ, స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(సర్), యూజీసీ కొత్త గైడ్​లైన్స్, కొత్త విదేశాంగ విధానం, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. 

ఈ సమావేశంలో రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా, కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్.మురుగన్, జైరాం రమేశ్(కాంగ్రెస్), తిర్చు శివ (డీఎంకే), సాగరిక ఘోష్ (టీఎంసీ), రాంగోపాల్ యాదవ్(ఎస్పీ), సీసీఐ(ఎం) జాన్ బ్రిట్టాస్, టీడీపీ, బీఆర్ఎస్, ఇతర పార్టీకలు చెందిన ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్​పై వివరణాత్మక చర్చకు టీఎంసీ, వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఓట్​ చోరీ, సర్, వడ్ల సేకరణ, నరేగ పునరుద్ధరణ, ఇతర అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. 

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల ఆఫీసులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై డీఎంకే, టీఎంసీ, వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే, సెషన్​కు సంబంధించి ప్రభుత్వ వ్యవహారాల ఎజెండాను ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్, సీసీఐ(ఎం) జాన్ బ్రిట్టాస్, ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపారు. మరోవైపు బడ్జెట్ సెషన్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ (సీపీపీ) సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరిగింది.

జీ రామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకోబోం:కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఇది బడ్జెట్ సెషన్ అయినందున.. చర్చలు ప్రధానంగా ఉండాలని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే సర్​పై వివరణాత్మక చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్​ను తోసి పుచ్చారు. చివరి రెండు సెషన్లలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు.