నల్గొండ అర్బన్, వెలుగు : సయ్యద్ లతీఫ్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న మదీనా మజీద్ నుంచి సయ్యద్ లతీఫ్ ఉల్లాషా ఖాద్రి గంధం ఉత్సవం ప్రారంభమైంది.
ఈ ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సయ్యద్ లతీఫ్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. హిందూ, ముస్లింలు కులమతాలకతీతంగా గుట్టపైకి వెళ్లి సయ్యద్ లతీఫ్ ఉల్లాషా ఖాద్రిని దర్శించుకునేందుకు త్వరలోనే సుమారు రూ.30 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మిస్తామన్నారు.
ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది..
ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీఎం కప్ క్రీడల్లో భాగంగా నల్గొండలోని గడియారం సెంటర్లో టార్చ్ లైట్ జ్యోతిని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. యువత క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు. అనంతరం పట్టణంలోని బొట్టుగూడ ఉన్నత పాఠశాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
అన్ని తరగతి గదుల్లో డిజిటల్ టీవీల ఏర్పాటు చేయాలని, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా పాఠశాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.