
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీల పై తాము కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడబోమని చెప్పారు. ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ మేరకు సిట్ దర్యాప్తును పరిశీలించడంతోపాటు సాధ్యాసాధ్యాలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ)లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు నేతృత్వంలో మాజీ అడిషనల్ ఎస్పీ ప్రణీత్‌రావు టీమ్ అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ చేసింది. దేశభద్రతకు భంగం కలిగించే విధంగా ట్రాయ్‌కు తప్పుడు సమాచారం అందించారు. త్రిపుర గవర్నర్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా కేంద్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేయించారు.
►ALSO READ | టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్.. నేడు బాధ్యతల స్వీకరణ.. రెండోసారి అవకాశం..
వీరితోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ బేరర్లుసహా ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లను ట్యాప్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరి మధ్య జరిగిన సంభాషణలు విన్నట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ మేరకు బండి సంజయ్సహా రాష్ట్ర బీజేపీ కార్యాలయ ఆఫీస్ బేరర్ల స్టేట్‌మెంట్లను సిట్ రికార్డ్ చేసింది.
ఫార్ములా–ఈ రేస్ స్కామ్‌లో రూ.600 కోట్ల క్విడ్‌ప్రో కో
ఫార్ములా–ఈ రేస్ స్కామ్‌లో రూ.600 కోట్ల క్విడ్‌ప్రో కో జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఫార్ములా–ఈ రేస్ నాలుగు సీజన్ల కోసం ఏమాత్రం సంబంధం లేని హెచ్ఎండీఏ ద్వారా మూడేండ్ల పాటు రూ.600 కోట్లు ఖర్చు చేసేలా అగ్రిమెంట్స్ చేసుకున్నారని, ఇందుకు పలు రూపాల్లో ప్రతిఫలం పొందేలా ప్రణాళిక రచించారని తెలిపింది. ప్రభుత్వం మారడంతో వీరి వ్యూహం బెడిసి కొట్టిందని.. ఇందుకు సూత్రధారులైన మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్ ముమ్మాటికీ శిక్షార్హులని పేర్కొంది.వీరిద్దరి న్యాయవిచారణకు అనుమతి కోరుతూ విజిలెన్స్కమిషనర్, స్పీకర్, సీఎస్‌కు సెప్టెంబర్ 9న లేఖలు రాసింది.