రాజకీయ యాత్రలు కాదు..తీహార్ ​జైలు యాత్రలు చెయ్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాజకీయ యాత్రలు కాదు..తీహార్ ​జైలు యాత్రలు చెయ్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     కేసీఆర్​కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్​

హైదరాబాద్‌‌, వెలుగు :  కేసీఆర్ రాజకీయ యాత్రలకన్నా.. తీహార్ జైలు యాత్ర చేస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తే.. కేసీఆర్ తనపైనే బురదజల్లి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నా జీవితం ప్రజా సేవకే అంకితం. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న. నాపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కర్రు కాల్చి వాతలు పెడ్తరు.

నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. నేను కాంట్రాక్ట్ కంపెనీలో డైరెక్టర్​గా కానీ.. పార్టనర్​గా కానీ లేను. మీలాగా నాకు బుర్జ్ ఖలిఫాలో 69 ఫ్లోర్​లో ఇల్లు లేదు. ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్న. నీకు దమ్ముంటే నాకు కంపెనీ ఉందని నిరూపించు..’’అని కేసీఆర్​కు మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం సాయంత్ర ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్.. కేసీఆర్​లో స్పష్టంగా కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. భూ కబ్జాలు, లిక్కర్ మాఫియా, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్ మాఫియా గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్​లో అరెస్ట్ అవుతానేమో అన్న భయం కేసీఆర్​లో కనిపిస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ కోరుతామన్నారు.