
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనుల్లో వేగం పెంచాలని, కాంట్రాక్టర్లతో నిత్యం మాట్లాడుతూ వర్క్ స్టేటస్ తెలుసుకోవాలని అధికారులను రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ హైవేస్ అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం మూలంగా మూడేండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అతి తక్కువగా నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. ఇక నుంచి అలసత్వానికి తావు ఇవ్వకూడదన్నారు. శుక్రవారం హైటెక్ సిటీలోని న్యాక్ ఆఫీసులో నేషనల్ హైవేస్, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్– విజయవాడ హైవేస్ పై మంత్రి రివ్యూ చేశారు.
జులై మొదటి వారంలో రాష్ట్రానికి ఎన్ హెచ్ ఉన్నతాధికారుల బృందం రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మంజూరై నడుస్తున్న పనులు, అనుమతుల కోసం ఆగిపోయినవి, అప్ గ్రేడ్ కోసం విన్నవించిన సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్హెచ్-65 (హైదరాబాద్–-విజయవాడ) విస్తరణ, రిపేర్ల కోసం గతంలో తీసుకున్న కాంట్రాక్టును క్లోజ్ చేసి.. వచ్చే నెలలో కొత్త టెండర్లు పిలిచి సెప్టెంబరులో పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలని ఎన్ హెచ్ఏఐ రీజనల్ ఆఫీసర్ రజాక్ ను మంత్రి ఆదేశించారు. మన్నెగూడ రోడ్డు నిర్మాణంలో ఆలస్యంపై అధికారులను మంత్రి ప్రశ్నించారు.
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశానుసారం 930 చెట్లను రీలొకేట్ చేయాల్సి ఉండడంతో పాటు పలు అనుమతుల వల్ల ఆలస్యం అవుతున్నదని అధికారులు తెలిపారు. చెట్లు లేని, రోడ్డు నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డు ఎందుకు వేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఇక ఆర్మూరు–-మంచిర్యాల జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని అధికారులు తెలిపారు. మిగతా పనులను ఈ నెలలో పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు.
మూసీ ప్రక్షాళనతో మరో మెట్టు ఎక్కుతం
మూసీ ప్రక్షాళనతో రాష్ట్రం మరో మెట్టు ఎక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైటెక్స్ లో ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్’ హైదరాబాద్ రీజనల్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ఉత్సవ్ ఎగ్జిబిషన్ ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఎగ్జిబిషన్లు మార్గం చూపుతాయన్నారు. ఎగ్జిబిషన్ లోని ప్రతి స్టాల్ ను మంత్రి పరిశీలించారు. చేర్యాల నకాషీ పెయింటింగ్స్ ను చూసి కళాకారులను అభినందించారు. చేర్యాల కళ తెలంగాణ సంస్కృతిని ఇనుమడింపచేస్తుందని ఆయన అన్నారు.