
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులు వచ్చే జూన్ 2 నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. శుక్రవారం నల్గొండలో కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో నూతన కలెక్టర్ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భవనంలో రెవెన్యూ విభాగం, కలెక్టర్, అడిషన్ కలెక్టర్లు, మంత్రి ఛాంబర్లు ఉండేలా నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. పాత కలెక్టర్ కార్యాలయంలో పూర్తిగా జిల్లాలోని అన్ని శాఖల అధిపతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
పాత కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తిగా ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. కొత్త కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ హాల్ ను ఫాల్ సీలింగ్, ఎల్ఈడీ స్క్రీన్లు వంటి అన్ని సౌకర్యాలతో నిర్మించాలన్నారు. కలెక్టరేట్భవన నిర్మాణ అంచనాలను ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
భవన నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠిను కోరారు. అనంతరం బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ దర్గా గుట్టలపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్ల నిర్మాణ పనులపై ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఘాట్ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ఇంజినీర్ వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ రెడ్డి , నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, ఏవో మోతీలాల్ తదితరులు ఉన్నారు