
నల్గొండ, వెలుగు : నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ ప్రజలు తనను ఆశీర్వదిస్తూ వస్తున్నారని, వారి కోసం ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు. డాక్టర్బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి, ఎడ్యుకేషన్ పై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమని, దాని ఖ్యాతిని పెంచేలా వీసీ, రిజిస్ట్రార్, పాలక సభ్యులు పనిచేయాలని సూచించారు. యూనివర్శిటీకి ప్రత్యేకంగా రూ.60.22 కోట్ల గ్రాంట్ మంజూరు చేశామని, ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేస్తున్ననుందున కొత్త కోర్సులపై ఆరా తీశారు. విశ్వవిద్యాలయంలో కొత్తగా ఫార్మసీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం వంటి కోర్సులు ప్రారంభించేందుకు చొరవ చూపాలని వీసీ అల్తాఫ్ హుస్సేన్ మంత్రిని కోరారు.
వెంటనే స్పందించిన మంత్రి.. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తేవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నల్గొండలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, లా కాలేజీ ఏర్పాటు చేయాలనేది నా చిరకాల కోరికని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలో నూతన కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సాంకేతిక, ఉన్నత విద్యామండలి కమిషనర్ దేవసేన, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి తదితరులు పాల్గొన్నారు.