నల్గొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తాం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ జిల్లాను  సుభిక్షంగా మారుస్తాం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ, ఆరు నెలల్లో బ్రాహ్మణ వెల్లెంల పూర్తి
  • రోడ్ల, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రి అయ్యాక మొదటిసారి సోమవారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రికి కాంగ్రెస్‌ శ్రేణులు  ఘన స్వాగతం పలికాయి. అంతకుముందు ఆయన ఆందోల్‌ మైసమ్మ గుడి వద్ద, నల్గొండలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, ఆరు నెలల్లో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. నల్లగొండలో గూండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తామన్నారు.

అక్రమ ఇసుక దందా, బెల్టు షాపుల ఆట కట్టిస్తామన్నారు. 10 ఏళ్లు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అని, ఏ సమస్య ఉన్నా  మినిస్టర్స్ క్వార్టర్స్ లోని  4 నెంబర్ క్వార్టర్ , సెక్రటరేట్ లో 5వ ఫ్లోర్‌‌లోని తన ఆఫీస్‌కు రావొచ్చన్నారు.  నార్కట్​పల్లి బస్ డిపో ఎత్తివేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, బస్సులు పెంచి డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.  నార్కట్​పల్లి -అమ్మనబోలు రోడ్డు , భువనగిరి- చిట్యాల రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తామని చెప్పారు. 

భగీరథ కింద కృష్ణా జలాలు ఇవ్వాలి 

నల్గొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో కలెక్టర్‌ కర్ణన్‌ అధ్యక్షతన మిషన్‌ భగీరథ, నీటిపారుదల, రోడ్లు భవనాలు, ఇతర శాఖల ఈఎన్‌సీలతో మంత్రి రివ్యూ చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్‌ భగీరథ చేపట్టినా ఇంకా చాలా గ్రామాలకు నీళ్లందడం లేదన్నారు. బోరు నీటితో కృష్ణా జలాలు కలిపే ఇస్తున్నారన్నారు. వాటన్నింటిని వెంటనే తనిఖీ చేసి ఇంటింటికీ కృష్ణా జలాలు అందించేలా  చర్యలు చేపట్టాలని ఈఎన్‌సీకి సూచించారు. మిర్యాలగూడలో సరిపడా నీరు అందడం లేదని, అది కూడా కలుషితమవుతోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు.

అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని అక్కడికక్కడే కలెక్టర్‌ కర్ణన్‌ ఆదేశాలు జారీ చేశారు. రైతులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అవసరమైన సబ్‌ స్టేషన్లు, ఇతర విస్తరణ పనులు చేయించాలని అందుకు అవసరమైన పనులకు ప్రపోజల్స్​ ఇస్తే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో విద్యుత్‌ ప్రమాదాలతో చనిపోయిన 32 మందికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని మంత్రి ఆఫీసర్లకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా   చూడాలన్నారు.

సమీక్షలో మంత్రితోపాటు భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే  బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

హెలికాప్టర్ నుంచి పూల వర్షం

హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆందోల్‌ మైసమ్మ దేవాలయం వద్ద, చౌటుప్పల్​, చిట్యాల, నార్కట్​పల్లిలో కాంగ్రెస్​శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద వేలాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆయనను స్వాగతించారు.  అక్కడ మంత్రి అంబేద్కర్‌ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు.

అక్కడ నుంచి ర్యాలీగా ఎన్జీ  కాలేజీకి రాగా, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నేత చల్లూరి మురళిధర్ రెడ్డి  హెలికాప్టర్‌ ద్వారా మంత్రిపై పూల వర్షం కురిపించారు.  అనంతరం బీఆర్​ఎస్​కు చెందిన కౌన్సిలర్లు, మాతంగి సత్యనారాయణ, ఏర్పుల రవి, మారగోని నవీన్​కుమార్​, పేర్ల జానయ్యతో పాటు పలువురు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.