నల్లగొండ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ గతంలో దళితుడిని సీఎం చేస్తాం.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్న పదేండ్లలో హామీలు అమలు చేయలేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో విచ్చిన్నమైందని.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని అన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీలో పంపకాల కోసం అధిపత్య పోరు జరుగుతుందన్నారు. ఫ్యామిలీ టెన్షన్స్‌తో కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారని.. అందుకే జగిత్యాల సభలో నోటికి వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. కేసీఆర్ ఫస్ట్ ఆయన ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆ తర్వాత పార్టీ పునర్నిర్మాణం గురించి ఆలోచించాలని సూచించారు.
జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. 2039 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. కాగా, సోమవారం (ఏప్రిల్ 21) జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.

