- సీఎం, పీసీసీ చీఫ్‌కు మంత్రి కోమటిరెడ్డి లేఖ
- తనను, తన కుటుంబాన్ని తిట్టాడని పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇటీవల అపాయింట్ అయిన పున్న కైలాష్ నేతను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌చేశారు.
ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఆయన మంగళవారం లేఖలు రాశారు.
ఎలాంటి కారణం లేకుండా తనను, తన కుటుంబాన్ని చివరకు చనిపోయిన తన తల్లిదండ్రులను మీడియా ముందు దుర్భాషలాడి తమను మానసిక క్షోభకు గురి చేశాడని అందులో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోందని ప్రస్తావించారు.
ఆయనను వెంటనే డీసీసీ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించి, సమర్థుడైన మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని లేఖలో కోరారు. కైలాష్ నేతపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీకి కూడా మంత్రి కోమటిరెడ్డి లెటర్ రాశారు.
