- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంతో పాటు జొన్నలగడ్డ గూడెం గ్రామంలో పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అప్పుడే గ్రామాల్లో అభివృద్ధి పనులు స్పీడ్‌గా జరుగుతాయన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇండ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, మోష, రమేశ్, కిన్నెర అంజి, ఎల్లయ్య, సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
