వరంగల్ జిల్లాలో కబ్జాలకు గురైన ఆలయ భూములను కాపాడుతాం : కొండా సురేఖ 

వరంగల్ జిల్లాలో కబ్జాలకు గురైన ఆలయ భూములను కాపాడుతాం : కొండా సురేఖ 
  • భద్రాచలం ఈవో అంశాన్ని సామరస్యంగా పరిష్కరిస్తాం
  • భద్రకాళి నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి కొండా సురేఖ పూజలు 

వరంగల్‍, వెలుగు: కబ్జాలకు గురైన దేవాలయ భూములను కాపాడుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్​ జిల్లాతో పాటు రాష్ట్రంలో అనేక దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనట్టు గుర్తించామని, కోట్ల విలువైన ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. గురువారం వరంగల్​ భద్రకాళి ఆలయంలో నిర్వహించిన శాకాంబరి ఉత్సవాల్లో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కబ్జాలకు సంబంధించి పాత రికార్డులు తెప్పించుకుంటున్నట్టు పేర్కొన్నారు. 

అవసరమైతే కోర్టులను ఆశ్రయించనున్నట్టు వివరించారు. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవికి, ఇతరులకు మధ్య వివాదంపై సమగ్ర విచారణ జరిపి సామరస్యంగా పరిష్కరిస్తామని ఆమె వెల్లడించారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సున్నితమైన వ్యవహారమన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రాష్ట్రంలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, బాసర వంటి ఆలయాల అభివృద్ధికి డీపీఆర్‍లు రూపొందించామని పేర్కొన్నారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం 11 ఏండ్ల తర్వాత ధర్మకర్తల మండలి ఏర్పాటు చేశామన్నారు. భద్రకాళి ఆలయంలో మాడవీధుల పనులు చకచక జరుగుతున్నాయని పేర్కొన్నారు.