
- కల్చరల్ సెంటర్స్‌తో మానసిక ఒత్తిళ్లకు పరిష్కారం: వెంకట్‌రెడ్డి
- ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో కల్చరల్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి
- హాజరైన మంత్రి కొండా సురేఖ, సినీ నటుడు చిరంజీవి
హైదరాబాద్, వెలుగు : సమాజంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లకు, యాంత్రిక జీవనానికి కల్చరల్ సెంటర్స్ పరిష్కారం చూపిస్తాయని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్‌ను మంత్రి కొండా సురేఖ, సినీ నటుడు చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల్లో అద్భుతమైన కల్చరల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కల్చరల్ సెంటర్‌లో వాతావరణం, వసతులు బాగున్నాయని, ఇవన్నీ చూశాక తనకు కూడా సభ్యత్వం తీసుకోవాలనిపించిందన్నారు. ప్రభుత్వం తరఫున మౌలిక సదుపాయల కల్పనకు ఏమైనా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి అవసరమైన మేరకు వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో చిన్న కుటుంబాలు పెరిగాక ఆత్మహత్యల శాతం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జీవితాంతం బతకడానికి సరిపడేంత డబ్బు, ఆస్తి ఉన్నా..
పిల్లలు విదేశాల్లో ఉండడంతో ఒంటరితనంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. దీనికి చిత్ర పరిశ్రమలోని నటుడు రంగనాథ్ ఆత్మహత్యే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒంటరితనం వల్ల ఇబ్బందులు పడుతున్న పెద్ద వయసు వారికి ఇలాంటి కల్చరల్ సెంటర్స్ ఒక మార్గం చూపించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవికి మంత్రి వెంకట్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు.