పేపర్ లీక్పై మళ్లీ ఎంక్వైరీ: మంత్రి కొండా సురేఖ

పేపర్ లీక్పై మళ్లీ ఎంక్వైరీ:  మంత్రి కొండా సురేఖ
  • బీఆర్​ఎస్​ దళారులకే సింగరేణిలో ఉద్యోగాలు
  •  ఎంత దండుకున్నావో లెక్కలు తీయాలా
  • కవితపై మంత్రి సురేఖ ఫైర్​

హైదరాబాద్​: పేపర్ లీక్ పై మళ్లీ ఎంక్వైరీ జరుగుతుందని మంత్రి సురేఖ ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్​వద్ద ఆమె మాట్లాడారు. టీఎస్పీఎస్సీ చైర్మన్​మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు.  మహేందర్ రెడ్డి అవినీతి అధికారి ఐతే మీరు డీజీపీగా ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మహేందర్రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా  లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా అని నిలదీశారు
.
 టీడీపీలో  పనిచేసిన పాల్వాయి రజినీని టీఎస్పీఎస్సీ మెంబర్​గా ఎలా నియమించారని, అలాగే ఆంధ్ర వ్యక్తిని ఎలా నియమించారని మాట్లాడ్డం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర  కాంట్రక్టర్లను పెంచి పోషించింది కేసీఆరేనని ఆరోపించారు.  

సింగరేణి లో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ దళారులే సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదన్నారు.  బీఆర్ఎస్​హయాంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. తాము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికీ తెలుసన్నారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావో లెక్కలు తీయాలా అంటూ కవితపై ఎదురుదాడికి దిగారు. 

 ఒక్కసారి మాట్లాడే ముందు వెనుక ముందు చూసుకోవాలని కవితకు హితవు పలికారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు అని విమర్శించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. త్వరలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు