ప్రతిపక్షాల ఆరోపణలకు మహిళా సంఘాలు కౌంటర్ ఇవ్వాలె

ప్రతిపక్షాల ఆరోపణలకు మహిళా సంఘాలు కౌంటర్ ఇవ్వాలె

జగిత్యాల : టీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో ప్రచారం చేయాలని పరోక్షంగా మహిళా సంఘాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక టౌన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ఐకేపీ వీవోఏల ఉద్యోగుల సంఘం ఆత్మీయ సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర  ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గ్రామాల్లో మహిళా సంఘాలు కౌంటర్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తుంటే వీవోఏలుగా గ్రామాల్లో నిజాలు చెప్పి, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు. 

‘మహిళా శక్తి అజేయమైంది. దాన్ని మంచి ప్రభుత్వం, నాయకుడి గెలుపుకోసం కృషి చేయాలి. ఆ ఆయుధం తిరిగి కేసీఆర్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు వినియోగించాలి’  అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. రాష్ట్ర ప్రజలకు ఇంకా మేలు జరగాలంటే టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ఉండేలా మహిళా సంఘాల కార్యాచరణ ఉండాలని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పక్షాన, సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహిళా సంఘాలు పని చేయాలన్నారు. ‘పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వం బలంగా ఉంటుంది. ప్రభుత్వం బలంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం బలంగా ఉండాలంటే మహిళా శక్తి తోడు ఉండాలి’  అని అన్నారు.