40 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బీమా

40 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బీమా

తాను 2009 ఎన్నికల్లో గెలిచి మంత్రి అవుతానని అనుకోలేదని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. తాను ఇలా ఉన్నాను అంటే సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదమేనని, తనకు శక్తి ఉన్నంతకాలం ప్రతి కులానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. జూన్ 24వ తేదీ శుక్రవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. విద్య విషయంలో సిరిసిల్లలోని జిలెల్లలో వ్యవసాయ కళాశాల త్వరలోనే ప్రారంభం కాబోతోందని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సర్దాపూర్ లో పాల్ టెక్నిక్ కళాశాల ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ.. అగ్రహారంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ లలో డిగ్రీ కాలేజిలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. అలాగే అన్ని కుల సంఘాల భవనాలకు భూమి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల ద్వారా సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 6 మీటర్ల మీదకి వచ్చాయని చెప్పుకొచ్చారు.

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ లను సాధ్యమైనంత తొందరగా ఏర్పాటు చేస్తామని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తాను తీసుకెళుతానన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 8 ఏళ్లుగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ.. ఇలా ప్రతి సంక్షేమ పథం పేదవాడికి ఇస్తున్నట్లు తెలిపారు. ‘40 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా రూ. 5 లక్షలు అందిస్తున్నాం.. దేశంలో రైతులకు న్యాయం జరుగుతోంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే.. ప్పటి ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కోసం నానా తిప్పలు పడ్డాం...ఆనాడు కరెంట్ పోతే వార్త...కానీ నేడు కరెంట్ ఉంటే వార్త’ అంటూ వెల్లడించారు మంత్రి కేటీఆర్.