తెలంగాణ టెక్స్‌‌టైల్‌‌ రంగానికి కేంద్ర బడ్జెట్‌‌లో నిధులు కేటాయించాలె:మంత్రి కేటీఆర్

తెలంగాణ టెక్స్‌‌టైల్‌‌ రంగానికి కేంద్ర బడ్జెట్‌‌లో నిధులు కేటాయించాలె:మంత్రి కేటీఆర్
  • కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌‌ విజ్ఞప్తి
  • కాకతీయ టెక్స్‌‌టైల్‌‌కు 900 కోట్లు, సిరిసిల్ల క్లస్టర్‌‌‌‌కు 100 కోట్లు కేటాయించాలని వినతి
  • టెక్స్‌‌టైల్‌‌ రంగంలో బంగ్లాదేశ్‌‌, శ్రీలంక కంటే వెనకబడ్డామన్న మంత్రి


హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ టెక్స్‌‌టైల్‌‌ రంగానికి కేంద్ర బడ్జెట్‌‌లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తమ ప్రభుత్వం నేత కార్మికుల సం క్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, కానీ 8 ఏండ్లుగా కేంద్రం నుంచి ప్రోత్సాహం లభిం చడం లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌‌ ఇదేనని, వచ్చే బడ్జెట్‌‌ ఓట్‌‌ ఆన్‌‌ అకౌంటే కాబట్టి ఈసారి రాష్ట్రంలో టెక్స్‌‌టైల్‌‌ రంగం బలోపేతానికి నిధులివ్వాలని బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయని తెలిపారు. ఈ పార్క్‌‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని, కేం ద్ర బడ్జెట్‌‌లో రూ.900 కోట్లు కేటాయించాలని కోరారు. టెక్స్‌‌టైల్‌‌ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం ప్రత్యేక పాలసీ రూపొందించకపోవడం, ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో బంగ్లాదేశ్‌‌, శ్రీలంక లాంటి చిన్న దేశాల కంటే మనదేశం వెనకబడిపోయిందని చెప్పారు. కాంప్రహెన్సివ్‌‌ పవర్‌‌ లూమ్‌‌ క్లస్టర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ స్కీంలో భాగంగా సిరిసిల్ల మెగా పవర్‌‌లూమ్‌‌ క్లస్టర్‌‌ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని ఆయన తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు 5 వేలకు పైగా పవర్‌‌లూమ్‌‌ మగ్గాలుంటే కేంద్రం నిధులిచ్చే అవకాశముందని, తాము సిరిసిల్లలో ఏర్పాటు చేసే క్లస్టర్‌‌లో 25 వేలకు పైగా మగ్గాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ క్లస్టర్‌‌కు కనీసం రూ.100 కోట్లు కేటాయించాలని కేటీఆర్‌‌‌‌ కోరారు.

నేషనల్‌‌ టెక్స్‌‌టైల్‌‌ రీసెర్చ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ పెట్టాలె..

సిరిసిల్లలో మరమగ్గాల ఆధునీకరణ, వ్యాల్యూ చైన్‌‌ బలోపేతం, మార్కెట్‌‌, స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌, కెపాసిటీ బిల్డింగ్‌‌, ప్రాజెక్టు మానిటరింగ్‌‌ కోసం రూ.990 కోట్లు ఖర్చవుతాయని, ఇందుకోసం కేంద్ర బడ్జెట్‌‌లో నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌‌‌‌ విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి, గద్వాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌‌ జిల్లాల్లో 40 వేల మంది హ్యాండ్లూమ్‌‌ కార్మికులు పనిచేస్తున్నారని, వీరి కోసం ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ హ్యాండ్లూమ్‌‌ టెక్నాలజీ సంస్థ మంజూరు చేయాలన్నారు. నేషనల్‌‌ టెక్స్‌‌టైల్‌‌ రీసెర్చ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌, హ్యాండ్లూమ్‌‌ ఎక్స్‌‌పోర్ట్‌‌ ప్రమోషన్‌‌ కౌన్సిల్‌‌ ఏర్పాటుపై బడ్జెట్‌‌లో ప్రకటించాలన్నారు. ఆలిండియా హ్యాండ్లూమ్‌‌, పవర్‌‌లూం, హ్యాండిక్రాఫ్ట్‌‌ బోర్డులు పునరుద్ధరించాలని కోరారు. వర్కర్‌‌ కం ఓనర్‌‌ పథకాన్ని పునరుద్ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్‌‌ చేశారు. పవర్‌‌లూమ్‌‌ జీఎస్టీ స్లాబ్‌‌ను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలని కోరారు.