రాజకీయ లాభాపేక్ష లేకుండా భవిష్యత్తు తరాలు బాగుపడాలనే హరిత హారానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు మంత్రి పట్టాలు అందించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఎంతో కసరత్తు చేసి దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రంగంపేట అటవీ భూ సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. పోడు భూములను ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 307 ఎస్టీలు, ఇతర పేదలకు 281 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించామని చెప్పారు.
ఇష్టారీతిగా చెట్లను నరికితే గాలిని కూడా కొనే పరిస్థితి ఉంటుందని, అలాంటి పరిస్థితి రావొద్దని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపడుతోందని మంత్రి అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. వీర్నపల్లిలో 15 కోట్ల రూపాయలతో బ్రిడ్జీల నిర్మాణం చేసి రోడ్లను అభివృద్ధి చేసామని చెప్పారు. చిన్న జిల్లాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజలకు పాలన దగ్గర చేశామన్నారు. 500 మంది ఉన్న తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. అడవిని కాపాడుకోవడం మన అందరి బాధ్యతని. అడవిని విధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీర్నపల్లిలో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని, పేదవారి ముఖంలో ఆనందం చూడాలన్నదే సీఎం లక్ష్యమని అన్నారు.
ఇంత కష్ట కాలంలోనూ 57 లక్షల మంది రైతులకు రైతు బందు ఇచ్చామని చెప్పారు కేటీఆర్. వ్యవసాయం ను లాభసాటిగా మార్చేందుకే నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని.. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి, వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రి అన్నారు.
