టిప్పర్ ఢీకొని బాలుడు మృతి..హైదరాబాద్‌‌లో ఘటన

టిప్పర్ ఢీకొని బాలుడు మృతి..హైదరాబాద్‌‌లో ఘటన

శంషాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో ఘోరం జరిగింది. టిప్పర్ ఢీకొని బాలుడు చనిపోయాడు. మైలార్‌‌‌‌దేవ్‌‌పల్లి డివిజన్‌‌ శాస్త్రిపురంలోని హుడా పార్కులో ఆడుకునేందుకు స్థానిక బాలుడు అబ్దుల్లా రెహన్ (7).. తన అన్న, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం 5 గంటల టైమ్‌‌లో బయలుదేరాడు. అయితే పార్కుకు వెళ్తుండగా శాస్త్రిపురం దగ్గర మలుపు వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ రెహన్‌‌ను ఢీకొట్టింది. 

దాని టైర్ కింద పడి బాలుడు నలిగిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు వచ్చి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. రెహన్ డెడ్‌‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ గులాం రసూల్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.