మోదీ పచ్చి అబద్ధాల కోరు : కేటీఆర్

మోదీ పచ్చి అబద్ధాల కోరు : కేటీఆర్
  • అధికారిక భేటీని నీచ రాజకీయాలకు వాడుకుంటారా?
  • ఎన్డీఏలో చేరడానికి మమ్మల్నేమీ పిచ్చికుక్క కరవలేదు : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోదీ పచ్చి అబద్ధాల కోరు అని, బీజేపీ అంటే జూటా ఫ్యాక్టరీ ఆఫ్​ ఇండియా అని బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ​ఫైటర్​ అని.. మోదీ లాంటి చీటర్​తో ఆయన కలిసి పని చేయబోరని, తాము ఢిల్లీ బానిసలం.. గుజరాత్​ గులాములం కాదన్నారు. గుండెలు చించుకొని అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవన్నారు. మంగళవారం హైదరాబాద్​ బంజారాహిల్స్​లో కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ ​సభలో రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ​కుటుంబంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ​ఖండించారు. 

మీతో ఉన్న వారసత్వ రాజకీయాలు గుర్తుకు రావా?

కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న మోదీ.. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ ​ఠాకూర్, బీసీసీఐ చీఫ్ ​జైషా ఎవరో చెప్పాలని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘‘ఎన్డీఏలో ఉన్న పార్టీల వారసత్వ రాజకీయాలు ప్రధాని మోదీకి గుర్తుకు రావా? వాళ్లతో ఉన్నోళ్లు రాజులు, యువరాజులు అన్న సంగతి తెలియదా?” అని ​మంత్రి ప్రశ్నించారు. ప్రకాశ్​ సింగ్ ​బాదల్, సుఖ్బీటర్​ సింగ్​ బాదల్, ముఫ్తీ మహ్మద్​ సయీద్, మెహబూబా ముఫ్తీ, చంద్రబాబు, లోకేశ్, బాల్ ​థాక్రే  కొడుకు ఉద్దవ్ ​థాక్రేతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్లు రాజులు, యువరాజులు అన్నది ఆయనకు తెలియదా? అని కేటీఆర్​ ప్రశ్నించారు. తాజాగా జేడీఎస్​తో పొత్తు పెట్టుకున్నారని.. దేవెగౌడ కుమారుడు కుమారస్వామిది వారసత్వ రాజకీయమే కదా అని ప్రశ్నించారు. వాళ్లతో ఉన్నప్పుడు మంచోళ్లు.. లేకుంటే చెడ్డోళ్లు అన్నట్టుగా ప్రధాని వ్యవహార శైలి ఉందన్నారు.  కథలు చెప్పడంలో ప్రధాని ఆరి తేరారని, ఆయన సినిమాకు కథలు రాసుకుంటే మంచిదన్నారు. 

ఎన్డీఏ మునిగిపోతున్న నావ 

పార్టీలన్నీ ఎన్డీఏను వదిలి వెళ్లిపోతున్న సమయంలో తమకు ఎన్డీఏలో చేరాల్సిన అవసరం ఏముందని, అది మునిగిపోతున్న నావ అని కేటీఆర్​ అన్నారు. ఎన్డీఏలో చేరడానికి తమను పిచ్చి కుక్కేమీ కరవలేదన్నారు. బీజేపీతో ఈడీ, సీబీఐ లాంటివి తప్ప ఇంకే పార్టీ లేదన్నారు. రాహుల్​ ఇక్కడికి వచ్చి తమను బీజేపీకి బీ టీం అంటున్నాడని, ప్రధాని వచ్చి తాము కాంగ్రెస్​తో కలిసి పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీ​ నుంచి బీఆర్ఎస్​కు డబ్బులు వస్తుంటే కేంద్ర ఐటీ, ఇతర శాఖలు నిద్రపోతున్నాయా చెప్పాలన్నారు. ప్రధాని మోదీ అబద్ధాల ప్రచారకర్త అని, జూమ్లాలకు ఆయన ప్రసిద్ధి అన్నారు. ఇంటింటికీ తాగునీళ్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని, దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్​ డాలర్లకు చేరుస్తామని చెప్పి ఒక్కటీ చేయలేదన్నారు. రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారిన వ్యక్తి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

ప్రధానితో భేటీకి కెమెరా పట్టుకొని పోవాలేమో!

ప్రధానికి ముఖ్యమంత్రికి మధ్య జరిగిన అధికారిక సమావేశాలను మోదీ తన నీచమైన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని కేటీఆర్​ మండిపడ్డారు. ఇలాంటి అబద్ధాల ప్రధానితో అధికారిక సమావేశాలకు కెమెరా పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్హతల విషయంలోనే అబద్ధాలు చెప్పిన మోదీ మాటలను ఎవరూ నమ్మబోరన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా అబద్ధాలు చెప్పడం ప్రధానికి అలవాటు అయిందన్నారు. బెంగాల్​లో మమతా బెనర్జీపై, ఒడిశాకు వెళ్లి నవీన్ ​పట్నాయక్ పై, మేఘాలయకు వెళ్లి సంగ్మాపై ఇలాగే అబద్ధాలు చెప్పారన్నారు. కాంగ్రెస్​లో ఉన్నప్పుడు హిమంత బిశ్వశర్మపై పెట్టిన కేసులు బీజేపీలో చేరాక ఏమయ్యాయో చెప్పాలన్నారు. నారాయణ రాణే, జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్లపై కేసులు ఎటుపోయాయని ప్రశ్నించారు.  బీఆర్ఎస్​లో ఎవరు సీఎం కావాలనేది నిర్ణయించేది ప్రధాని కాదని, తమ పార్టీ ఎమ్మెల్యేలు అన్న విషయం మోదీకి తెలియదా అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు మూడోసారి సీఎంగా కేసీఆర్​ను ఎన్నుకోవడానికి రెడీగా ఉన్నారన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రజలు బీజేపీని పట్టించుకోరని.. గత ఎన్నికల్లో 105 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్​గల్లంతయిందన్నారు. ఈసారి110 సీట్లలో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని.. మోదీకి దమ్ముంటే ఈ సవాల్​స్వీకరించాలన్నారు. 

కరెంటు, నీటి కష్టాలు తీర్చినం

జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్ ​ప్రభుత్వం వచ్చాక కరెంటు కష్టాలు, నీటి కష్టాలు తొలగించామని.. కోట్లాది రూపాయలతో రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్‌‌‌‌ఆర్ఎస్‌‌‌‌పీకి జలకళ వచ్చిందని మంత్రి కేటీఆర్​అన్నారు. మిషన్ భగీరథ పథకంతో సీఎం కేసీఆర్​ఇంటింటికి తాగునీరు అందించారని కొనియాడారు. మంగళవారం జగిత్యాల జిల్లాలో కేటీఆర్​పర్యటించారు. జగిత్యాల జిల్లా పోలీస్ ఆఫీస్, నూకపెల్లి లోని 3722 డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ధర్మపురి మాత, శిశు సంరక్షణ కేంద్రం, సైఫన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 4 లక్షల 25 వేల మంది బీడీ కార్మికులకు నెలకు 2 వేల పించను, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కంటి వెలుగు ప్రవేశపెట్టిన గొప్పనేత కేసీఆర్ అన్నారు