మోడీ ప్రభుత్వ సంస్థలను అమ్ముతుండు

మోడీ ప్రభుత్వ సంస్థలను అమ్ముతుండు

సిరిసిల్ల: మోడీ ఆధ్వర్యంలో బేచో ఇండియా కార్యక్రమం నడుస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కొటిగా ప్రభుత్వ సంస్థలను అమ్ముతోందని  ఆరోపించారు. తన మిత్రుడిని ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా చేసేందుకు మోడీ దేశంలోని వ్యవసాయం, విద్యుత్ రంగాలను దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం, విద్యుత్ రంగాలు దివాళా తీశాయని చెప్పి, తర్వాత ఆ రెండు రంగాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నిందని మండిపడ్డారు. దేశంలో పండిన ప్రతి గింజను కేంద్రం కొనాలని, అందుకు కావాల్సిన ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని ఫుడ్ సెక్యూరిటీ చట్టంలో ఉందని, అయితే కేంద్రం ఆ చట్టానికి తూట్లు పొడుస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ధాన్యం సేకరణను ప్రైవేట్ కు అప్పజెప్పాలని కేంద్ర సాగు కార్యదర్శి సుధాంశ్ పాండే చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ తీరును ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. దొడ్డి దారిన చట్టాలు, గెజిట్లు తెచ్చి దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. దేశంలోని చిన్న, సన్నకారు రైతుల కష్టాలు మోడీకి కనబడుతలేవని మంత్రి ఫైర్ అయ్యారు. నల్ల చట్టాలు తెచ్చి 7 వేలకు పైగా రైతులను పొట్టనపెట్టుకున్నారని ఫైర్ అయ్యారు.

మోడీ హయాంలో పేద దేశంగా భారత్..

ప్రపంచంలోనే అత్యధిక పేదలు భారత్ లో ఉన్నారని సర్వే సంస్థలు చెబుతున్నాయని, మోడీ హయాంలో జరిగిన గొప్ప అభివృద్ధి ఇది అంటూ ఎద్దేవా చేశారు. ఆర్ధిక రంగంలో భారత్  నైజీరియా కంటే కూడా వెనకపడిందని అన్నారు. ప్రపంచ ఆహార సంస్థ విడుదల చేసిన ఆకలి దేశాల జాబితాలో భారత్ 101వ స్థానంలో ఉందని, ఆ జాబితాలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే భారత్ వెనకబడి ఉందని చెప్పారు. దేశంలో వ్యవసాయానికి కావాల్సిన అన్ని వనరులు ఉండి కూడా సమర్థవంతమైన  నాయకత్వం లేకపోవడంతో దేశం వెనక్కి పోతోందని తెలిపారు. 

రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్ రంగాలకు కొత్తపుంతలు

రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్ రంగాలు కొత్తలు పుంతలు తొక్కుతున్నాయన్న మంత్రి...రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం, రైతు వేదికలు, మిషన్ భగీరథ వంటి ఎన్నో పథకాలతో రాష్టంలో పుష్కలంగా పంటలు పండుతున్నాయని తెలిపారు. 50 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం అందుకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. ధాన్యాన్ని కొనాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్తే.. దేశంలో ఎక్కడా పండనంతా పంట తెలంగాణలో పండేందుకు ఏం చమత్కారం చేశారంటూ అవమానించారని తెలిపారు. కొత్తగా తెచ్చిన విద్యుత్ బిల్లుతో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి విద్యుత్ సబ్సిడీలు రాకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నాయీ బ్రాహ్మణు, రజకులు, వ్యాపార రంగాలకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తి వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలు అమలైతే రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరగనుందని చెప్పారు. కేంద్ర విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేటీఆర్ అన్నారు.