కాంగ్రెస్​ను నమ్మితే మోసపోతరు : కేటీఆర్

కాంగ్రెస్​ను నమ్మితే మోసపోతరు : కేటీఆర్
  • కర్నాటకలో ఇట్లనే నమ్మించి మోసం చేసిన్రు: కేటీఆర్ 
  • ఇప్పుడక్కడ వ్యవసాయానికి 5 గంటల కరెంట్ కూడా ఇస్తలేరు
  • కాంగ్రెస్​కు ఎందుకు ఓటేశామని అక్కడి రైతులు చెంపలేసుకుంటున్నారని కామెంట్
  • బీఆర్ఎస్​లో చేరిన కాంగ్రెస్ నేత సత్యనారాయణ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ను నమ్మితే మోసపోతారని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​అన్నారు. కర్నాటకలో ఇట్లనే నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇప్పుడక్కడ రైతులకు 5 గంటల కరెంట్​కూడా ఇవ్వడం లేదన్నారు. పెద్దపల్లి నియోకజ వర్గానికి చెందిన కాంగ్రెస్​నేత సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ రామ్మూర్తి, మహబూబ్​నగర్​డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రసాద్​సహా పలువురు నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. బుధవారం తెలంగాణ భవన్​లో కేటీఆర్​ వాళ్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నాటక లెక్క మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్​ను నమ్మి ఓటేస్తే, వ్యవసాయానికి మూడు గంటలకు మించి కరెంట్​రాదని అన్నారు. ఈ విషయం పీసీసీ అధ్యక్షుడే స్వయంగా చెప్పారన్నారు. ‘‘ఏఐసీసీ అధ్యక్షుడి సొంత రాష్ట్రం కర్నాటకలో ఇచ్చిన గ్యారంటీలకే దిక్కు లేకుండా పోయింది. ఇక తెలంగాణలో అమలు చేస్తరా? కర్నాటకలో కాంగ్రెస్​కు ఓటేసినందుకు అక్కడి రైతులు చెంపలేసుకుంటున్నారు. 

ఆ రాష్ట్రంలో చెరువులు ఎండిపోయి మొసళ్లు బయటికి వస్తే, వాటిని రైతులు తీసుకెళ్లి సబ్ స్టేషన్లలో వదిలిపెట్టి నిరసన తెలుపుతున్నారు. అయినా 5గంటలకు మించి కరెంట్ ఇవ్వలేమని ఆ రాష్ట్ర సీఎం, మంత్రులు చెబుతున్నారు” అని తెలిపారు. ‘‘కరెంట్​గురించి రేవంత్​రెడ్డి ఏమన్నాడో మీ అందరికీ తెలుసు. ‘తెలంగాణలో ఉన్నది చిన్న, సన్నకారు రైతులు. బీదబిక్కి రైతులు. 90 శాతం మందికి మూడెకరాల కన్నా ఎక్కువ భూమి లేదు. కేసీఆర్ కు బుద్ధి లేదు. మూడు గంటల కన్నా ఎక్కువ ఎందుకు కరెంట్. 24 గంటల కరెంట్​ఇచ్చి పైసలన్నీ దండుగ పెడుతుండు. గంటకో ఎకరం పారుతది. మూడు గంటల కరెంట్​చాలు’ అని రేవంత్ అన్నడు. ఇగో ఇంత తెలివైనోళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్​ను నడుపుతున్నరు. తెలంగాణల దబ్బన పొరపాటున్నో, గ్రహపాటున్నో కాంగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటల కరెంటే దిక్కు అని వాళ్ల అధ్యక్షుడే చెప్తున్నడు. రైతులు ఆలోచన చేయాలి” అని కోరారు. 

11సార్లు మోఖా ఇస్తే.. దోఖా ఇచ్చిన్రు.. 

‘‘కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇయ్యాల గద్దలు, రాబంధుల పాలైతుంటే ఉండబట్టలేక కాంగ్రెస్​ను వీడి సొంత గూటికి వచ్చానని సత్యనారాయణ రెడ్డి అంటున్నారు. ఈ సోయి.. ఈ రేషం తెలంగాణలో అందరికీ రావాలి” అని కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్రంలో కరెంట్, తాగు, సాగునీరు బాగా చేసుకున్నామని.. సంక్షేమం అద్భుతంగా చేసుకుంటున్నామని తెలిపారు. ‘‘ఇన్ని చేసుకుని రాష్ట్రాన్ని ఆ దొంగల చేతుల్లో, ఆ దగుల్బాజీ కాంగ్రెస్​చేతుల్లో పెడితే నాశనమైతది. తెర్లు తెర్లు అయితది.. ఆ మాట మరిచిపోకున్రి.. వాళ్లు కొత్తోళ్లు కాదు.. కొత్త రూపాల్లో వస్తున్నరు. 11 సార్లు వాళ్లకు మోఖా ఇస్తే బార్​బార్​దోఖా ఇచ్చిన్రు. ఈరోజు మళ్లా కొత్త వేషం వేసుకుని వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ల డీఎన్ఏ, ఆలోచన, నీతి గదే. ఖర్గే సొంత రాష్ట్రంలోనే కరెంట్​ఇయ్యనోళ్లు.. ఇక్కడ ఇస్తరా” అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ ను నమ్మితే కష్టాలే.. 

ఒక్క అవకాశం అంటూ వస్తున్న కాంగ్రెస్​ను నమ్మితే కష్టాలు తప్పవని కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్​దేశంలో ఏ ఒక్కరినీ కూడా ఓన్​చేసుకోదు. అందుకే అందరూ ఆ పార్టీకి దూరమవుతున్నారు. బీఆర్ఎస్​ను తెలంగాణలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పార్టీ, తెలంగాణ పార్టీగా భావిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం. ఎస్సారెస్పీ నీళ్ల కోసం చొప్పదండి, పెద్దపల్లి ప్రజల మధ్య ఎప్పుడూ పంచాయితీ జరిగేది. కాకతీయ కాల్వపై మోటార్లు పెడితే విజిలెన్స్​కేసులు పెట్టేవారు. వైర్లు కట్​చేసి మోటార్లను కాల్వలో పడేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. నీళ్ల కోసం కొట్లాడుకోవాల్సిన దుస్థితి లేదు” అని చెప్పారు. కేసీఆర్​భరోసా పేరుతో పార్టీ ఇచ్చిన 15 హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.