హైదరాబాద్ నగరంలో పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాలు రక్షణకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ పరిథిలో అక్రమణలను అరికట్టేందుకు జిహెచ్ఎంసి డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీనికోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ‘అస్సెట్ ప్రొటెక్షన్ సెల్’ ను ఏర్పాటైంది. అస్సెట్ ప్రొటెక్షన్ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 0099ను ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రజల సహకారం కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
నగర పరిధిలోని చెరువులు, పార్కులు, బహిరంగస్థలాల్లో కబ్జాకు పాల్పడినా, ప్రైవేట్ కార్యకలాపాలకు పాల్పడినా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు మంత్రి. అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ పనిచేస్తుందన్నారు. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేకంగా ఒక నంబర్ ను కేటాయించడం జరుగుతుందని, ఆ నంబర్ ద్వారా భవిష్యత్తులో కంప్లయింట్ యొక్క ప్రొగ్రెస్ ని తెలుసుకునే వీలుంటుందన్నారు. సమాచారం అందించే వారి వివరాలు కోరుకుంటే గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలోని జోన్లు, సర్కిళ్లలో ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించామని గ్రేటర్ అధికారులు తెలిపారు.
