ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు

ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. మార్చి 25వ తేదీ శనివారం ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వనస్థలిపురం–దిల్‌సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీ నగర్ కూడలి దగ్గర నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనదారులకు ప్రయాణం మరింత సులువుగా మారనుంది.

మార్చి 25వ తేదీ శనివారం నుంచి LB నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎల్బీనగర్ జంక్షన్ ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్ అని నామకరణం చేస్తున్నామని వెల్లడించారు. SRDP కింద 650 కోట్ల రూపాయలతో  LB నగర్ లో తీసుకున్న 12 ప్రాజెక్టులలో 9వది ప్రారంభించామన్నారు కేటీఆర్. మిగిలిన 3 ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు పోతామని స్పష్టం చేశారాయన. తెలంగాణ వచ్చాక అభివృద్ధి ఎలా జరిగిందో LB నగర్ కు వస్తే తెలుస్తుందని సూచించారు. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని..అది కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకు కూడా తెలుసన్నారు. 1200 కోట్ల రూపాయలతో ఫ్రూట్ మార్కెట్ ప్లేస్ లో టీమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

ఇక రూ.32 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించింది ప్రభుత్వం. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ నుండి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుండి హయత్ నగర్ మీదుగా వచ్చే ప్రజలకు ఎంతగానో దోహద పడుతుంది. 700 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లై ఓవర్ వలన వాహన వేగం కూడా పెరుగనున్నది. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో, ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా.. వాటిలో ఎల్బీనగర్ ఫ్లైఓవర్ 19వది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఫ్లైఓవర్లను నిర్మిస్తూ రవాణాను సులభతరం చేస్తుంది. ఇప్పటికే సిటీలో అనేక ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి.