రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడొద్దనే రైతు బీమా: కేటీఆర్

రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడొద్దనే  రైతు బీమా: కేటీఆర్

పాలకుడే రైతైతే పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి తెలంగాణే నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన ఆయన దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. సీఎం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక మానవీయత ఉంటుందని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవని, ఐక్యరాజ్యసమితి కూడా రైతు బంధును ప్రశంసించిన విషయాన్ని ప్రస్తావించారు. రైతుబంధు తీ సుకునే వారిలో 98శాతం చిన్న, సన్నకారు రైతులేనన్న కేటీఆర్.. రైతు చనిపోతే కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్ధేశ్యంతో రైతు బీమా పథకం తీసుకొచ్చామన్నారు. ఇప్పటి వరకు 94,500 కుటుంబాలకు రైతు బీమా అందించినట్లు వివరించారు.

నాబార్డ్ నివేదిక ప్రకారం వ్యవసాయ రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని కేటీఆర్ చెప్పారు. బియ్యం ఉత్పత్తిలో పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరడం సంతోషంగా ఉందని అన్నారు. కేంద్రం తెచ్చిన నల్లచట్టాలకు 700మంది రైతుల బలికావడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.