
- కోచ్‌ల సంఖ్యను కూడా పెంచాలి: కేటీఆర్
- మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్ పోర్ట్ మెట్రోపై మంత్రి సమీక్ష
- విస్తరిస్తున్న మెట్రో రైల్‌కు సర్వేలు చేసి డీపీఆర్ ఇవ్వాలని ఆదేశం
- పాతబస్తీ మెట్రో కారిడార్‌ను త్వరగా చేయాలని కేటీఆర్‌కు అక్బరుద్దీన్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: మెట్రో రైల్ విస్తరణ పనులను మరింత వేగంగా చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్‌పోర్ట్ మెట్రో వ్యవస్థపై గురువారం మెట్రో రైల్ భవన్ లో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితర శాఖాధిపతులు హాజరయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వం నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను భారీగా విస్తరిస్తోందన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను విస్తరిస్తే మరిన్ని భారీ కంపెనీలు హైదరాబాద్ సిటీకి వస్తాయన్నారు.
మెట్రో రైల్‌ను విస్తరించే ప్రణాళికలను సిద్ధం చేస్తూనే ప్రస్తుతం కారిడార్లలో తిరిగే రైళ్లకు కోచ్ ల సంఖ్యను పెంచాలని సూచించారు. మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టిపెట్టి ఫీడర్ సర్వీసులను ప్రారంభిస్తే మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేయవచ్చన్నారు. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ అథారిటీ వర్గాలు 48 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో కోసం కేటాయించాలన్నారు. లకిడికపూల్ నుంచి బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు విస్తరించాలనుకుంటున్న మెట్రో మార్గం కోసం రూ.9,100 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగామని, దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. విస్తరిస్తున్న మెట్రో లైన్‌లకు సర్వేలు చేపట్టి డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు.
ఖాళీ జాగాలను గుర్తించండి
మెట్రో రైల్ విస్తరణలో భాగంగా మెట్రో స్టేషన్లతో పాటు కార్ పార్కింగ్, కాంప్లెక్స్ ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ జాగాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లను కేటీఆర్ ఆదేశించారు. మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు సూచించారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై ప్రజంటేషన్ అందించారు. మెట్రో విస్తరణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అందుబాటులో ఉన్న పరిష్కారాలను తన ప్రజంటేషన్‌లో వివరించారు. కాగా, ఈ సమావేశం అనంతరం ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్‌తో సమావేశయ్యారు. పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగంగా చేయాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.