ములాయం మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ములాయం మృతి పట్ల ప్రముఖుల సంతాపం

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి  ములాయం సింగ్ యాదవ్ మృతి చెందడంపై సిఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ తో పాటు..ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ములాయం సింగ్ యాదవ్ మరణం చాలా బాధాకరమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.  ములాయం మృతి సోషలిజంలో ఓ పోరాట యుగానికి ముగింపు అని చెప్పారు. ములాయం ఆత్మకు శాంతి కలగాలని  ప్రార్థించారు.  కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

 

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణ వార్త చాలా విచారకరమని బహుజన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ మాయావతి అన్నారు. ములాయం కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు  ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని వారందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. 
 

ములాయం సింగ్ యాదవ్ మరణంపై  అఖిలేష్ యాదవ్తో పాటు..ములాయం కుటుంబానికి మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ములాయం మృతి భారత రాజకీయాల్లో శకానికి ముగింపు అని చెప్పారు. ప్రశాంతంగా ఉండండి నేతాజీ అని ట్వీట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు,,విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థించారు. 


ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అకాల  మరణంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సుదీర్ఘ కాలంపాటు ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ములాయం సింగ్ అని గుర్తు చేశారు.  ఆయన మరణం బడుగు బలహీన వర్గాలు ప్రజలకు తీరని లోటని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ ఆత్మ కు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.