ఎన్నికల్లో ఆగం కావొద్దు.. మనస్సుకు నచ్చినట్టు ఓటు వేయండి : కేటీఆర్

ఎన్నికల్లో ఆగం కావొద్దు.. మనస్సుకు నచ్చినట్టు ఓటు వేయండి : కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. తమ ఎమ్మెల్యేలతో తనకు రోజు పంచాయతీ అవుతోందని, తమ పాత్ర లేకుండా అన్ని నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయంటూ తనతో అంటున్నారని అన్నారు. --డైరెక్ట్ గా లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి మేలు జరగాలనేదే సీఎం కోరిక అన్నారు. తమకు తెలంగాణ ప్రజలపై విశ్వాసం ఉందన్నారు. తెలంగాణలో మొట్టమొదటి గుడిసెలు లేని నియోజకవర్గం సిరిసిల్ల అని చెప్పారు. గుడిసెలు కనపడవద్దనే అందరికీ గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గంలో మొత్తం17 వందల 47 మందిని ఎంపిక చేశామన్నారు.

తనకు గౌరవం ఉందంటే అది సిరిసిల్ల ప్రజలు ఇచ్చినదని, తాను ఏనాడు మర్చిపోనన్నారు. గృహలక్ష్మి పథకం కింద ఇంకా ఎవరైనా ఉంటే ముఖ్యమంత్రి కాళ్లు మొక్కి అయినా లబ్దిదారులకు ఇస్తామన్నారు. -మిగిలిన వారికి కూడా త్వరలో ఇండ్లు కట్టిస్తామన్నారు. అనుమానం వద్దని, ఎవరి చుట్టూ తిరగవద్దన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే తన పేరు చెప్పాలన్నారు. తాము ఖర్చు చేసేది ప్రజల డబ్బులని, తమ సొంత డబ్బులు కాదన్నారు. కాకపోతే పద్ధతి ప్రకారం ఖర్చు చేస్తున్నామని, అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిరిసిల్లలో 90 శాతం ఇండ్లు పూర్తయ్యాన్నారు. 

ఇండ్లు కావాలని కౌన్సిలర్లు, సర్పంచుల వద్దకు ఎవరూ పోవద్దన్నారు. అధికారులే పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని చెప్పారు. తాము చెప్పిన ప్రకారం కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు నడుచుకుంటున్నారని, వారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాను అని అన్నారు. మల్కపేట రిజర్వాయర్ పూర్తైందన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారం రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఎట్లున్న సిరిసిల్ల, వేములవాడ ఎట్లయ్యాయి..? ఇంట్లో ఆలోచన చేయండి..? ఎన్నికల్లో ఆగం కావొద్దు.. మనస్సుకు నచ్చినట్టు ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. తాము డెవలప్ చేస్తే ఓట్లు వేయండి అని కోరారు. ఓటు వేస్తారని ఆశిస్తున్నామన్నారు.