మీ దయుంటే గెలుస్త.. లేదంటే ఇంట్ల కూసుంట : మంత్రి కేటీఆర్​

మీ దయుంటే గెలుస్త.. లేదంటే  ఇంట్ల కూసుంట : మంత్రి కేటీఆర్​

రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: ఓట్లు అనంగనే చాలా మంది పిచ్చోళ్లు మోపైతరని, మందు పోస్తరని, పైసలు పంచుతారని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. ‘‘నేను నా జీవితంలో మందు పోయలే.. పైసలు పంచలే.. రేపు ఎన్నికల్ల కూడా మందు పొయ్య, పైసలు పంచ. సిరిసిల్ల ప్రజల దయుంటే గెలుస్త.. లేదంటే ఇంట్ల కూసుంట” అని ఆయన అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో కేటీఆర్​ పాల్గొన్నారు. బీసీ కులవృత్తుల వారికి రూ. లక్ష సాయం స్కీమ్​ కింద 600 మందికి సిరిసిల్ల కలెక్టరేట్​లో  చెక్కులు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలోళ్ల దాక  సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్రం  తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని పేర్కొన్నారు. ఇప్పటికే దళితులు,  బీసీలు,  మైనార్టీలకు ఆర్థికసాయం అందిస్తున్నామని,  రాబోయే రోజుల్లో  ఎస్టీ బంధును కూడా కేసీఆర్​ తెస్తారని ఆయన అన్నారు. కేసీఆర్​ ఉన్నంతకాలం సంక్షేమ పథకాల గురించి ప్రజలు బెంగపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 

చేనేత దినోత్సవం సందర్భంగా  నేతన్న బీమా ప్రారంభించామని,  59 ఏండ్లు నిండిన నేత కార్మికులకు బీమా వర్తిస్తుందన్నారు. ‘‘లక్షలాది మందికి పెన్షన్లు, కల్యాణలక్ష్మి తదితర స్కీమ్​ల కింద లబ్ధి కలుగుతున్నా పట్టించుకోని వారు .. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకరికి పెన్షన్ రాకపోతే , స్కీమ్​ అమలుకాకపోతే వార్తలు రాస్తున్నరు” అని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. తెలంగాణలో సంపద పెరగడం వల్ల    బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాల నుంచి కూలీలు వలస వస్తున్నారని,  సిరిసిల్ల మరమగ్గాల మీద కూడా ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చి పని చేస్తున్నారని అన్నారు. 

కాంగ్రెస్​ సన్నాసుల మాటలినొద్దు

‘‘ఈ దేశాన్ని యాభై ఏండ్లు పాలించిన సన్నాసులు ఏం చేసిన్రు?” అని కాంగ్రెస్​ నేతలపై కేటీఆర్​ మండిపడ్డారు. ‘‘మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టలేదు.పెన్షన్లు ఇయ్యలేదు. 
ఎన్నడూ ప్రజల బాధలను పట్టించుకోలేదు. కాంగ్రెస్​ నాయకులు వస్తే ఇదివరకు ఏం చేశారని ప్రజలు నిలదీయాలి. ఆ సన్నాసుల మాటలు వినొద్దు” అని కామెంట్​ చేశారు. కాంగ్రెస్  యాభై ఏండ్లలో చేయని పనులను తొమ్మిదేండ్లలోనే కేసీఆర్​ చేశారని ఆయన చెప్పారు. 

అన్ని సిరిసిల్లకేనా అని నన్ను తిడుతున్రు

‘‘సిరిసిల్ల జిల్లాకు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు మంజూరు చేసుకున్నం. ఈ మధ్యనే  ఎల్లారెడ్డిపేటకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరైంది. ఇక్కడ  జరుగుతున్న అభివృద్ధి పనులు చెప్తే.. ‘కేటీఆర్ అన్ని సిరిసిల్లకే తీసుకపోతున్నవని దుబ్బాక ఎమ్యెల్యే అంటున్నడు..  వేరే ఎమ్యెల్యేలు కూడా నన్ను తిడుతున్రు. అందుకే కొన్ని సీక్రెట్​గా చెయ్యాలని చెప్తే మావోళ్లకు అర్థమైతలేదు” అని కేటీఆర్​ అన్నారు. చేసిన పనులు షో చేయవద్దని పేర్కొన్నారు. కాగా, వేములవాడలో 24 గంటల పాటు భగీరథ నీళ్లు సప్లయ్​ చేయాలని అధికారులను కేటీఆర్​ ఆదేశించారు. నంది కమాన్ జంక్షన్ ను,  చింతల్ ఠానాలో 42 డబుల్ బెడ్రూం ఇండ్లను, వేములవాడ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్​ను ఆయన ప్రారంభించారు. గుడి చెరువు, బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను బతుకమ్మ పండుగలోపు పూర్తి చేయాలన్నారు.

ఇయ్యాల నిజామాబాద్ ​ఐటీ టవర్​ప్రారంభం

నిజామాబాద్​లో నిర్మించిన ఐటీ టవర్​ను మంత్రి కేటీఆర్​బుధవారం ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్​రెడ్డితో కలిసి బుధవారం ఉదయం 10.30కు  శంషాబాద్​ఎయిర్​పోర్టు నుంచి హెలికాప్టర్​లో నిజామాబాద్​ వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. ఉదయం11.15 గంటలకు నిజామాబాద్​కు చేరుకొని ఐటీ టవర్​ను ప్రారంభిస్తామని, అనంతరం నిజామాబాద్​లో నిర్మించిన న్యాక్​బిల్డింగ్, మున్సిపల్​ఆఫీస్,  మినీ ట్యాంక్​బండ్​తో పాటు రెండు వైకుంఠ ధామాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్​లో జరిగే బహిరంగ సభలో పాల్గొని 4 గంటలకు హైదరాబాద్​కు తిరిగి బయల్దేరుతామని ప్రకటనలో వివరించారు.

ఆఫీసర్లు నన్ను ఇంట్లకెంచి ఎల్లగొట్టిన్రు: కేటీఆర్​తో ఓ వృద్ధురాలు

మున్సిపల్ ఆధికారులు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, తనకు న్యాయం చేయాలని సిరిసిల్లలోని సర్దార్​నగర్​కు  చెందిన వృద్ధురాలు బుర్ర రాజేశ్వరి మంత్రి కేటీఆర్ కు మొరపెట్టుకుంది. ఇటీవల కురిసిన వానల వల్ల ఆమె ఇల్లు నీట మునగడంతో ఆమెను అధికారులు పునరావాస కేంద్రానికి తర లించి..  ఇంటికి తాళం వేశారు. పది రోజులైనా తాళం చెవి ఇవ్వడంలేదని, కిరాయి ఇంట్లో ఉంటే పెన్ష న్ పైసలు కూడా కిరాయికి సరిపోవని రాజేశ్వరి వాపోయింది. ఆమె ఇంటిని వెంటనే అప్పజె ప్పాలని అధికారులను కేటీఆర్​ ఆదేశిం చారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తమ చిన్నారి చనిపో యిందని రుద్రంగికి  చెందిన తర్రె రఘుపతి కుటుంబం వేములవాడ ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగింది. మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని కోరారు.  దీంతో పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లారు.