దేశంలో అగ్రగామిగా తెలంగాణ

దేశంలో అగ్రగామిగా తెలంగాణ

రాజన్న సిరిసిల్లా జిల్లా: సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చి... రైతును రాజుగా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... రైతుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ సర్కారు అహర్నిషలు కృషి చేస్తోందన్నారు. ఆ ఉద్దేశంతోనే దేశంలోనే తొలిసారి గా రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని స్పష్టం చేశారు. సుస్థిర ఆదాయం కోసం ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000 కోట్లు కేటాయించామని, ఉద్యాన వనాలు, పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. 

రైతు బీమా పథకంతో అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని పేర్కొన్నారు. పచ్చని మొక్కలతో హరిత విప్లవం, మాంస ఉత్పత్తితో గులాబీ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాల ఉత్పత్తితో శ్వేత విప్లవాలను సాధించామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆసరా పెన్షన్ తో ఆదుకుంటున్నామని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అందులో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను పొందు పరిచి కార్డులు అందజేస్తామన్నారు. విద్యతోనే భవితకు పునాది, భావితరాలకు పురోగతి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెడుతున్నట్లు  వెల్లడించారు. పారిశ్రామికంగా రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఎదుగుతోందని మంత్రి చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం...

కాలుష్యం గుప్పిట్లో యమునా నది

కుటుంబ పాలనతో అప్పుల తెలంగాణగా మారింది