యాదాద్రి తరహాలోనే వేములవాడను అభివృద్ధి చేస్తాం: మంత్రి కేటీఆర్​

 యాదాద్రి తరహాలోనే వేములవాడను అభివృద్ధి చేస్తాం: మంత్రి కేటీఆర్​
  • పర్యాటక ప్రాంతాలుగా సిరిసిల్ల, వేములవాడ
  • నాంపల్లి గుట్టపై కేబుల్​ కార్ సదుపాయం
  • ఎనిమిదేండ్లలో ఓల్డ్​ సిటీకి ఎంతో చేసినమని కామెంట్
  • వేములవాడ శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష


హైదరాబాద్, వెలుగు: యాదాద్రి తరహాలోనే వేములవాడ రాజన్న ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్​ అన్నారు. వేములవాడ మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్​లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబుతో కలిసి ఆయన సమీక్షించారు. జాతరకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని, అంబులెన్స్​లు, ఫైర్​ ఇంజన్​లు అదనంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జాతరకు అదనపు నిధులు ఇస్తామని, శివరాత్రి సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వేములవాడ, సిరిసిల్ల పట్టణాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతామన్నారు. సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై ఎత్తయిన శివుడి విగ్రహం, కాటేజీలు నిర్మిస్తామని, అడ్వెంచర్​ గేమ్స్​కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

ఇండ్లు ఎక్కువగా ఉండటం వల్లే రోడ్​ వైడెనింగ్​ ఆలస్యం

తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్​ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఎనిమిదేండ్లలో ఓల్డ్​ సిటీకి ఎంతో చేశామని కేటీఆర్​ అన్నారు. ఓల్డ్​ సిటీ అభివృద్ధిపైనా ఆయన సమీక్షించారు. ఎస్సార్డీపీలో భాగంగా ఓల్డ్​సిటీలో రోడ్​నెట్​వర్క్​ బలోపేతం చేస్తున్నామని, ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు, రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఓల్డ్​సిటీలో ఇండ్లు ఎక్కువగా ఉండడంతో రోడ్ల వైడెనింగ్​ఆలస్యంగా సాగుతోందని, తప్పనిసరి అయిన ప్రాంతాల్లో వైడెనింగ్​ పనులు వేగవంతం చేస్తామన్నారు. ట్రాఫిక్​ జంక్షన్లు, ఫుట్​ ఓవర్​ బ్రిడ్జీలు, మూసీపై బ్రిడ్జిల నిర్మాణం పనులు వేగంగా చేస్తున్నామన్నారు. చార్మినార్​పెడెస్ట్రియన్​ ప్రాజెక్టు పనులు పూర్తికావొచ్చాయన్నారు. ఓల్డ్​ సిటీలో తాగునీటి సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఎనిమిదేండ్లలో రూ.1,20‌‌‌‌0 కోట్లు ఖర్చు చేశామని, పలు ప్రాంతాల్లో సీవరేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మదీనా, మక్కా మసీద్, సాలార్జంగ్​ మ్యూజియం తదితర పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు. పాతబస్తీలో 84 బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశామన్నారు. మీర్ ఆలం మండలి మార్కెట్​ రిస్టోరేషన్​కు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మీర్​ ఆలం ట్యాంక్​ పై నుంచి ఆరు లైన్ల కేబుల్​ బ్రిడ్జి డీపీఆర్​ తుది దశలో ఉందన్నారు. సమావేశంలో మంత్రి మహమూద్​అలీ, ఎంపీ రంజిత్​ రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ, సీఎస్​ శాంతి కుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఫుట్​పాత్​లు, వాల్​పెయింటింగ్స్

వేములవాడలోని అన్ని ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఫుట్​ పాత్​లు నిర్మించాలని, అవకాశం ఉన్న ప్రతి చోటా వాల్​ పెయింటింగ్స్​వేయించాలని, మూలవాగుకు అనుకుని ఉన్న కట్టపై సైక్లింగ్​ ట్రాక్, వాకింగ్ ట్రాక్​ ఏర్పాటు చేయాలని అన్నారు. చెక్​డ్యాంల నిర్వహణ, వాటి పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న సంస్కృత పాఠశాలతోపాటు సంగీత, నృత్య పాఠశాలలు ఏర్పాటు చేయాలని, వాటికి ప్రత్యేక భవనాలు నిర్మించాలని సూచించారు. వేములవాడ మినీ స్టేడియం పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, కొదురుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లైన్​ల రోడ్డు నిర్మాణం, నాంపల్లి గుట్టపైకి రెండో ఘాట్​ రోడ్డు నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. గుడి చెరువును వరంగల్​ భద్రకాళి బండ్​ తరహాలో అభివృద్ధి చేస్తామని, నాంపల్లి గుట్టపై కేబుల్​కార్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో కలెక్టర్​అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్​మహాజన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.