బంద్‌కు సంపూర్ణ మ‌ద్ధ‌తు.. జాతీయ రహదారులపై ధర్నాలు చేస్తాం

బంద్‌కు సంపూర్ణ మ‌ద్ధ‌తు.. జాతీయ రహదారులపై ధర్నాలు చేస్తాం

హైద‌రాబాద్‌: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తమ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు మంత్రి కేటీఆర్.ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా భారత్ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో రైతులు నిరసన తెలుపుతున్నారని వారికి మద్దతుగా నిరసనలు తెలపాలన్నారు. కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల పై పార్టీ తరపున వాదనలు చెప్పాలని కేసీఆర్ ఆనాడే చెప్పారని , పార్లమెంట్ లో రైతు వ్యతిరేక బిల్లును టీఆరెస్ పార్టీ వ్యతిరేకించిందని మంత్రి గుర్తు చేశారు.

ఈ నెల‌ 8వ తేదీన రైతు బంద్‌ కు టీఆరెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ.‌. బంద్ లో పాల్గొంటున్నద‌ని, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నాలు, రాస్తారోకో చేస్తారని కేటీఆర్ అన్నారు. ప్రతి వ్యాపారవేత్త 10 గంటలకు కాకుండా 12 గంటలకు షాప్స్ తెరవాల‌ని, రెండు గంటలు బంద్ పాటించాల‌ని మంత్రి పిలుపు నిచ్చారు. వాణిజ్య‌, వ్యాపార సంస్థలు రైతు బంద్ కు సహకరించాల‌న్నారు. ట్రాన్స్ పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ బంద్ కు సహకరించాల‌ని, ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్లమీదకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.