ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే.. సంక్షేమం లేదు : కేటీఆర్

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే.. సంక్షేమం లేదు : కేటీఆర్
  • ఎన్నో చేసినం.. వచ్చే ఐదేండ్లలో ఇంకెన్నో చేస్తం 

ఇప్పటివరకు ఎన్నో చేశామని, వచ్చే ఐదేండ్లలో ఇంకెన్నో చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలు చెప్తున్న ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలే తప్ప సంక్షేమం లేదు. అడ్డమైనోళ్లు చెప్పే మాటలు నమ్మొద్దు” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్, సూర్యపేట జిల్లా కోదాడలో జరిగిన రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు. మునుగోడులో రాజకీయ అవకాశవాది అయిన రాజగోపాల్ రెడ్డిని ఓడించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు బీమా ఇవ్వలేదన్నారు. 

కరెంట్ రావడంలేదని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి అంటున్నారని.. మునుగోడు, కోదాడల్లో ఎక్కడికైనా వెళ్లి కరెంట్ వైర్లు పట్టుకుంటే తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ కు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి) పనులు చేయాలనడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. పథకాలు కావాలనుకుంటే అమలు చేసేవాళ్లనే గెలిపించుకోవాలన్నారు. కూసుకుంట్లను గెలిపిస్తే చౌటుప్పల్ లో అన్నింటికీ ఓకే అని చెప్పారు. 

డిగ్రీ కాలేజీ, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు, హాస్పిటల్, నిర్వాసితులకు పరిహారం.. అన్నీ ఇస్తామన్నారు. కాగా, చౌటుప్పల్ రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపూ సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తాయి. ఇదే సమయంలో చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీదకు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. 

మళ్లా గెలిచేది బీఆర్ఎస్సే..  

సోషల్ మీడియాలో బొబ్బ తప్ప కాంగ్రెస్ ఎక్కడా లేదని.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా దాటవని కేటీఆర్ అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి రెండు చోట్లా ఓడిపోతున్నాడని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఓడినంక మిగతా వాళ్ల పరిస్థితి కూడా అంతేనన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బుధవారం జరిగిన రోడ్ షోలోనూ కేటీఆర్ మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్ ను గెలిపిస్తే అక్కడి పరిశ్రమలు మూతపడి, పొలాలు ఎండుతున్నాయన్నారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్లబ్బులు, పబ్బులు, విందులు, చిందులు తప్ప రైతుల బాధలు తెల్వదన్నారు. రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని, హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ డిపాజిట్ గల్లంతు అవుతుందన్నారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గత ఎన్నికల్లో కరీంనగర్ లో పోటీ చేసి ఓడిపోయాడని.. అక్కడ చెల్లని నోటు ఇక్కడ చెల్లుతుందా? అని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని, మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనని స్పష్టం చేశారు.