మోడీ రైతుల కష్టం, పెట్టుబడిని డబుల్ చేసిండు : కేటీఆర్

మోడీ రైతుల కష్టం, పెట్టుబడిని డబుల్ చేసిండు : కేటీఆర్

దేశంలో గత ప్రధానులు రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోడీ మాత్రం లక్ష కోట్ల అప్పు చేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఉన్న ప్రధానుల్లో మోడీ అత్యంత అసమర్ధ ప్రధాని అన్నారు. దేశాన్ని ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే మరో ఇద్దరు గుజరాతీలు కొంటున్నారని విమర్శించారు. పీఎం ఆర్థిక సలహాదారు దెబాషిష్ రైతులకు ఆదాయ పన్ను వేయాలని ఓ పత్రికలో రాయడం దారుణమన్నారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో పాల్గొన్న ఆయన.. కార్పోరేట్లకు దోచిపెట్టే మోడీ కావాలా, పేదల పక్షపాతి కేసీఆర్ కావాలా అని జనాన్ని ప్రశ్నించారు.

మంత్రులు కూడా ఈర్ష్య పడే రీతిలో నారాయణపేటలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. రూ.196 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్నా కృష్ణా నీటి వాటాలు తేల్చడంలో కేంద్రం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే 500 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించాలని, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు అడ్డుపడ్డా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి తేల్చిచెప్పారు.

ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ అని కేటీఆర్ విమర్శించారు. ఇన్నేళ్లలో ఒక్క జాతీయ సంస్థను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని వాపోయారు. కరోనా వ్యాక్సిన్ ను మోడీ కనిపెట్టారని కిషన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2022 వరకు రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్న మోడీ.. వారి కష్టం, పెట్టుబడిని డబుల్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలెప్పుడు వచ్చినా బీఆర్ఎస్ కు ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు.