సంఘాల వారీగా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తాం : కలెక్టర్ ఆదర్శ్సురభి

సంఘాల వారీగా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తాం : కలెక్టర్ ఆదర్శ్సురభి

వనపర్తి, వెలుగు: ఆటో, లారీ, పాఠశాలల బస్సు డ్రైవర్లకు సంఘాల వారీగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్​ఆదర్శ్​సురభి తెలిపారు. గురువారం కలెక్టరేట్​లో జిల్లా రవాణా శాఖ అధికారులతో కలిసి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్​ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను  ఆదేశించారు. 

పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు, యువత, వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. 8న కలెక్టరేట్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు భారీ బైక్ ర్యాలీ, లఘు నాటికలకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 

9న జిల్లాలోని లారీ డ్రైవర్లకు, 13న ఆటోడ్రైవర్లకు, 19న తుఫాన్, ఇతర లైట్ గూడ్స్ వెహికల్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీవో మానస, డీపీఆర్వో సీతారాం తదితరులు   పాల్గొన్నారు. అంతకుముందు అడిషనల్​ కలెక్టర్లు ఖీమ్యానాయక్​, యాదయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులు కలెక్టర్​ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.