
హైదరాబాద్, వెలుగు: దేశ ఆర్థిక వ్యవస్థ పతానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలే కారణమని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశారన్నారు. ప్రజల జీవితాలను తారుమారు చేసిన నోట్ల రద్దు నిర్ణయం పెద్ద తప్పు అని ప్రధాని మోడీ ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2016, నవంబర్ 8న మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విఫల ప్రయత్నం అన్నారు. బ్లాక్ మనీ వెలికితీత, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడం, టెర్రరిస్టులకు నిధులు వెళ్లకుండా ఆపడం, డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడానికే పెద్ద నోట్ల రద్దు అన్న మోడీ సర్కారు మాటలన్నీ అవాస్తవాలని తేలిపోయిందన్నారు.
నోట్ల రద్దు తర్వాత 2017 జనవరి నాటికి దేశంలో రూ.17.97 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉంటే, ఇప్పుడు ప్రజల వద్ద రూ.30.88 లక్షల కోట్ల నగదు ఉందని, అదనంగా రూ.12.91 లక్షల కోట్ల నగదు చలామణిలోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందన్నారు. నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ లాంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేశాయన్నారు. లక్షల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని తెలిపారు. 2016 నుంచి 2019 మధ్యకాలంలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.